
కుంభమేళా.. రైలెక్కేదెలా!
● 26తో ముగియనున్న కుంభమేళా
● గుత్తి–రేణిగుంట మార్గంలో ఒక్క రైలు కూడా లేని వైనం
● ప్రయాగ్‌రాజ్ ప్రయాణానికి ఇక్కట్లు
● రహదారి మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు
రాజంపేట: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా విశేషాలపై చర్చ సా గుతోంది. ఈనెల 26న మహాశివరాత్రి రోజు మహా కుంభమేళా వేడుకలు ముగియనున్నాయి. 144 ఏళ్లకొకసారి వచ్చే ఈ ఉత్సవాల సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించడం మంచిదని భక్తుల అచంచల విశ్వాసం. అందుకే ప్రయాగ్‌రాజ్‌కు నడిపిస్తున్న రైళ్లు భక్తులతో రద్దీగా మారుతున్నాయి. ఎంతగా అంటే తత్కాల్ టికెట్లు కూడా క్షణాల్లో రిజర్వు కావడం డిమాండ్‌ను తెలియజేస్తోంది.
రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ వల్ల
ఒరిగిందేమీలేదు: భారతీయ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్ ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా కనిపించడంలేదని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు. రైల్వేబోర్డుకు స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా తాను సిఫార్సు చేసి ఉంటే కుంభమేళాకు రైలు నడిపేవారు. అయినా ఆయన జిల్లా మీదుగా కుంభమేళాకు రైలు వేయించుకోలేకపోయారని భక్తులు పెదవి విరుస్తున్నారు.
ప్రైవేటు వాహనాలు, బస్సులను
ఆశ్రయించే పరిస్ధితి..
ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు కుంభమేళాకు వెళ్లేందుకు రైలు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు, బస్సులను ఆశ్రయించే పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు భక్తులు గ్రూపులుగా ఏర్పడి ప్రత్యేకంగా బస్సులు మాట్లాడుకొని వెళుతున్నారు. ఇలా వెళ్లే వారి సంఖ్య పెరిగిపోవడంతో ప్రయాగ్‌రాజ్ దారులు రద్దీగా మారుతున్నాయి. ఫలితంగా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతోంది. కొందరు బెంగళూరు, చైన్నె నుంచి విమానాల ద్వారా కుంభమేళాకు వెళుతున్నారు.
గుత్తి–రేణిగుంట లైనులో ఒక్క రైలేదీ..
గుత్తి–రేణిగుంట లైనులో కుంభమేళాకు వెళ్లేందుకు ఒక్క రైలు కూడా నడిపించలేదు. ఫలితంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైళ్ల గురించి తెలుసుకొని వ్యయ ప్రయాసాలతో గూడూరుకు వెళ్లి, అక్కడి నుంచి రైళ్ల ద్వారా చేరుకుంటున్నారు. తిరుపతి నుంచి కూడా ఇప్పుడు కుంభమేళాకు రైలు నడవడంలేదని రైల్వే వర్గాలు అంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లే రైళ్లు సదరన్ రైల్వే నుంచి వస్తే వాటిని ఆశ్రయించాల్సి వస్తోంది.
ఇంటర్‌సిటీనే కుంభమేళా రైలుగా నడిపించాలి
ఈ మార్గంలో నడిచే పేదోళ్ల రైలు ఇంటర్‌సిటీ(హుబ్లీ–తిరుపతి) రద్దు చేసి, ఆ రైలును కుంభమేళాకు వినియోగించారు. అదే రైలును ఈ మార్గంలో నడిపించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ రైలును తిరుపతి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు రోజూ నడిపిస్తే రాయలసీమ ప్రాంత భక్తులకు ఉపయోగపడేది. ఆ దిశగా రైల్వేశాఖ ఆలోచించకపోవడం విచారకరమని హిందూ సంస్థల ప్రతినిధులు వాపోతున్నారు.
సురక్షితం.. సౌకర్యం..
ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే వారికి రైళ్లు సురక్షితం. తక్కువ ఖర్చుతో గమ్యానికి చేరుకోవచ్చు. దీంతోపాటు రైల్వేస్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే త్రివేణి సంగమం చేరుకోవచ్చు. అక్కడే పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు తక్కువ ఖర్చుతో సకాలంలో చేరుకొనే వీలుంటుంది. వాహనాలు లభ్యంకాని భక్తులు నేరుగా నడకమార్గం ద్వారా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. రైల్వేశాఖకు రూ.కోట్ల ఆదాయం కూడా సమకూరుతుంది.
జిల్లా వాసులు రైలులో వెళ్లలేని పరిస్థితి
ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు కుంభమేళాకు వెళ్లలేని పరిస్థితి. రైలు సౌకర్యం ఉంటే వేలాదిమంది వెళ్లేవారు. రైలులో గూడూరు నుంచే వెళ్లాలి. టిక్కెట్లు దొరకవు. జనరల్ బోగీలలో వెళితే సీట్లు ఉండవు. నానా కష్టాలు పడాలి. జిల్లా రైలు మార్గంలో రైలు నడిపించకపోవడం దారుణం. మన ప్రాంతంపై రైల్వే వివక్ష చూపుతోంది. –భూమన శంకర్‌రెడ్డి,
మాజీ సర్పంచ్, నాగిరెడ్డిపల్లె
కుంభమేళాకు రైలు వేయాలని జీఎంను కోరా
జిల్లా మీదుగా కుంభమేళాకు ఒక రైలు నడపాలని ఇటీవల తిరుపతిలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఏకే జైన్‌ను కలిసి విన్నవించాను. కుంభమేళా ముగిసే లోపు ఒక్కసారి అయినా రైలు నడిపిస్తే భక్తులు సద్వినియోగం చేసుకుంటారు. రద్దయిన ఇంటర్‌సిటీనే కుంభమేళాకు ఏర్పాటు చేయాలి. –తల్లెం భరత్‌రెడ్డి,
డీఆర్‌యూసీసీ సభ్యుడు, గుంతకల్

కుంభమేళా.. రైలెక్కేదెలా!

కుంభమేళా.. రైలెక్కేదెలా!
Comments
Please login to add a commentAdd a comment