ఏపీజీబీ కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలి
కడప కార్పొరేషన్ : ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి.అంజద్ బాషా కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం ఆయన లేఖ రాశారు. రైతులు, కర్షకులు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఆ బ్యాంకు, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారిందన్నారు. రాయలసీమ గ్రామీణ బ్యాంకు, అనంత గ్రామీణ బ్యాంకు, పినాకినీ గ్రామీణ బ్యాంకులు ఐదు జిల్లాలకు సంబంధించి ఉండేవని, రాయలసీమ గ్రామీణ బ్యాంకు కడప కేంద్రంగా ఉండేదన్నారు. ఈ బ్యాంకు ఎక్కువ టర్నోవర్ సాధించడంతో కడపలో ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేశారన్నారు. ఇప్పుడు 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను 28 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుగా కుదించడంతో కడపలోని ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఈ ఆలోచనలను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలన్నారు. దేశంలోని 43 ప్రాంతీయ బ్యాంకుల కన్నా ఏపీజీబీ 552 శాఖలతో, రూ.50 వేల కోట్ల టర్నోవర్‌తో, రూ.802 కోట్ల లాభాలతో, రూ.4591కోట్ల రిజర్వ్‌తో వ్యాపారాభివృద్ధిలో మిగతా బ్యాంకుల కన్నా అగ్ర భాగాన ఉందన్నారు. ఈ బ్యాంకులో 2800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలోని హైకోర్టు, లా యూనివర్సిటీ, ఎంఎస్‌ఎంఈ కేంద్రం, గతంలో అనంతపురానికి రావాల్సిన ఎయిమ్స్‌ను ఇతర ప్రాంతాలకు తరలించి అన్యాయం చేశారన్నారు. వ్యాపారం, టెక్నాలజీ, ఆర్‌బీఐ అనుమతించిన ప్రత్యేకమైన కరెన్సీ, చెస్ట్ సౌకర్యం, సొంత భవనాలు ఏపీజీబీకే మిగతా వాటికంటే మిన్నగా ఉన్నాయన్నారు. 2006లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కడపలోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయానికి 0.50 సెంట్ల స్థలానికి కేటాయించగా, మరియాపురం వద్ద రూ.15 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారన్నారు. రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేయాలని ఆయన కోరారు.
ప్రభుత్వానికి లేఖ రాసిన
మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా
Comments
Please login to add a commentAdd a comment