బంగారం రికవరీ పేరిట మాకు వేధింపులా?
కడప కల్చరల్ : చోరీ జరిగిన బంగారాన్ని రికవరీ చేయడం పేరిట బంగారు దుకాణ యజమానులను వేధించడం సమంజసం కాదని కడప జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జరుగు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. వైవీ స్ట్రీట్‌లో కడప జ్యువెలర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ గత కొద్దికాలంగా పోలీసు యంత్రాంగం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని, కడపలోని ఏ నగల దుకాణ వ్యాపారి దొంగ బంగారాన్ని కొనుగోలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బంగారు కొనుగోలు విషయంలో ఇలాంటి అనర్థాలు వస్తాయనే విషయం తమకు తెలుసని, అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. దొంగ బంగారం కొనుగోలు చేసినట్లు పెద్ద మొత్తంలో రికవరీ చేస్తుండడంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. ఎవరికై నా ఇలాంటి సమస్యలు వస్తే అసోసియేషన్‌లో సంప్రదించాలని, సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యువెలర్స్ అసోసియేషన్ నాయకులు, బంగారు దుకాణాల నిర్వాహకులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
జ్యువెలర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జరుగు రాజశేఖర్‌రెడ్డి, గౌరవాధ్యక్షులుగా సయ్యద్ సలావుద్దీన్, ఆకుల రాజమోహన్, కార్యదర్శిగా సయ్యద్ చాంద్‌బాష, కోశాధికారిగా ఆకుల రాజశేఖర్‌లను ఎన్నుకున్నారు. వీరితోపాటు ఐదుగురు జాయింట్ సెక్రటరీలు, మిగతా కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కడప జ్యువెలర్స్ దుకాణదారుల ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment