అవమానించిందని మహిళ హత్య
వేముల : మండలంలోని కె.కె.కొట్టాల సమీపంలో ఈ నెల 2న జరిగిన సింగంశెట్టి పద్మావతి హత్య కేసును పోలీసులు చేధించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ ఉలసయ్య, ఎస్సై ప్రవీణ్ కుమార్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. కె.కె.కొట్టాల గ్రామానికి చెందిన సింగంశెట్టి పద్మావతి గ్రామ సమీపంలో ఎనుములు మేపుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వెళ్లారన్నారు. పద్మావతిని చంపి ఆమె శరీరంపై ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లారన్నారు. మృతురాలి కుమార్తె గోగుల దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బృందాలుగా ఏర్పడి నిందితుల ఆచూకీ కోసం గాలించామని తెలిపారు. మృతురాలు సింగంశెట్టి పద్మావతి తనను అవమానకరంగా మాట్లాడుతుండడంతో చంపాలని సింగంశెట్టి రమేష్ నిర్ణయించుకున్నాడన్నారు. ఈ నెల 2న ఎనుములు మేపుకొనేందుకు పద్మావతి వెళ్లగా.. అక్కడికి వెళ్లిన రమేష్ చేతులకు ప్లాస్టిక్ గ్లౌజులు ధరించి తలపై దాడిచేసి చంపాడన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాల కోసం చంపారనుకునేలా మెడలో బంగారు గొలుసు, చెవి కమ్మలు అపహరించాడన్నారు. బుధవారం ముద్దాయి సింగంశెట్టి రమేష్‌ను అరెస్టు చేసి అతని వద్ద బంగారు గొలుసు, చెవి కమ్మలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు వారు తెలిపారు.
నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment