వేంపల్లె : వేంపల్లె పట్టణ పరిధిలోని చింతలమడుగుపల్లె సమీపంలో కొందరు ఆకతాయిలు తన అరటి తోటకు నిప్పుపెట్టినట్లు ఎరబ్రోయిన రవి తెలిపారు. బాధితుడి వివరాల మేరకు.. చక్రాయపేట మండలం సిద్ధారెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన ఎర్రబోయినరవి వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె గ్రామ పొలాల్లో మూడు ఎకరాల్లో అరటితోట సాగు చేస్తున్నారు. ఈ తోటకు సమీపంలో కొందరు ఆకతాయిలు చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే రెండెకరాల్లో అరటి చెట్లు, ప్లాస్టిక్ పైపులు, డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. కాలిపోయిన అరటి పంటను హార్టికల్చర్ సిబ్బంది శివ పరిశీలించారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్ట పరిహారం అందించాలని కౌలు రైతు కోరారు.
అగ్నికి ఆహుతైన అరటి
పులివెందుల రూరల్ : గుర్తు తెలియని వ్యక్తులు బీడు భూమికి నిప్పంటించడంతో మంటలు వ్యాపించి అరటి తోటలో 46 చెట్లు దగ్ధమయ్యాయి. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెలమవారిపల్లెకు చెందిన రైతు చంద్రశేఖర్ నాయుడు ఎరబ్రండ కొత్తపల్లిలో ఆరు ఎకరాల్లో అరటి పంట సాగు చేశాడు. తోట పక్కన బీడు భూమి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డికి నిప్పంటించారు. మంటలు వ్యాపించి రైతుకు చెందిన అరటిచెట్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.60 వేల పంట నష్టం జరిగిందని రైతు చంద్రశేఖర్ నాయుడు తెలిపారు. ప్రభుత్వం స్పందించి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment