అడ్మిషన్ల జోరు.. తల్లిదండ్రుల బేజారు! | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్ల జోరు.. తల్లిదండ్రుల బేజారు!

Published Thu, Feb 20 2025 12:17 AM | Last Updated on Thu, Feb 20 2025 12:12 AM

అడ్మిషన్ల జోరు.. తల్లిదండ్రుల బేజారు!

అడ్మిషన్ల జోరు.. తల్లిదండ్రుల బేజారు!

●నిబంధనలకు విరుద్ధంగా..

‘ హలో సార్‌... మీ పాప రమ్య పదవ తరగతి చదువుతున్నది కదా..! ఇంటర్‌కు ఏం ప్లాన్‌ చేస్తున్నారు సార్‌? మాది ఫలానా కార్పొరేట్‌ కాలేజీ. ఐఐటీ, ఎంసెట్‌ కోచింగ్‌, ఏసీ, నాన్‌ ఏసీ స్పెషల్‌ బ్యాచ్‌లు ఉన్నాయి. హాస్టల్‌ సౌకర్యం కూడా ఉంటుంది. ఇప్పుడు జాయిన్‌ అయితే ఫీజులో కొంత డిస్కౌంట్‌ ఉంటుంది. పరీక్షల తర్వాత సీట్లు కష్టం. అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఫీజులు పెరుగుతాయి. ముందుగా సీటు రిజర్వ్‌ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కాలేజీ క్యాంపస్‌ను విజిట్‌ చేసి చూడండి ’ .

‘సార్‌ గుడ్‌ ఈవినింగ్‌, సురేష్‌ ఫాదరేనా? మీ అబ్బాయి ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు కదా. బీటెక్‌ కోసం ఏం ప్లాన్‌ చేశారు. తమిళనాడు, కేరళలోని ఫలానా యూనివర్సిటీల్లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్సు, ఏఐఎంల్‌, డేటా సైన్సు, మెకానికల్‌ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి.. ఆసక్తి ఉంటే చెప్పండి... రాయితీలు ఇప్పిస్తాం’...

మదనపల్లె సిటీ: టెన్త్‌, ఇంటర్‌ చదవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పుడు ఇలాంటి ఫోన్ల బెడద పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి , ఇంటర్మీ డియట్‌ కు సంబంధించి వేలాది మంఇ రాస్తున్నారు. కనీసం వార్షిక పరీక్షలు కూడా పూర్తి కాకముందే కార్పొరేట్‌ కాలేజీలు ప్రధానంగా కడప, ప్రొద్దుటూరు, మదనపల్లె, రాయచోటి, రాజంపేటతో పాటు మండల కేంద్రాల్లో సైతం బేరసారాలు ప్రారంభించాయి. అడ్డగోలు ఫోన్లు, ఆఫర్లతో తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నాయి. పరీక్షలు కూడా రాయకుండా అడ్మిషన్లు ఎలా తీసుకోవాలి... తీసుకోకుంటే ఫీజులు ఇంకా పెరుగుతాయేమో అని వారు ఆందోళనకు గురవుతున్నారు. అనుమతి లేకుండా విద్యార్థుల డేటాను సంపాదించి వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ వల విసురుతున్నారు. ఫోన్లు కాకుండా వాట్సాప్‌లకు అడ్మిషన్ల మెసేజ్‌లు పంపుతున్నారు. వీటికి ఎక్కువగా తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. ముందుగా మేల్కోకుంటే ఫీజులు ఎక్కడ పెంచుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకునేందుకు కార్పొరేట్‌ ఇంటర్‌, ఇంజినీరింగ్‌ కాలేజీలు గాలం వేస్తున్నాయి. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి రంగు రంగుల బ్రోచర్లు చూపి మంచి భవిష్యత్తు అంటూ ఆశల పల్లకిలో విహరింపజేస్తూ రూ.లక్షలో ఫీజులు బాదేస్తున్నారు.

మరో వైపు పీఆర్‌ఓలు...

తిరుపతి, విజయవాడ కేంద్రాల కార్పొరేట్‌ కాలేజీల తరపున వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం ఆయా విద్యా సంస్థల పీఆర్‌ఓలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రంగంలోకి దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు కొద్దిగా ఆసక్తి కనబర్చినా చాలు విద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. నామినల్‌ రోల్‌ ద్వారా విద్యార్థుల వివరాలు, ఫోన్‌ నంబర్లు, చిరునామా సేకరిస్తున్నారు. వాటి కోసం సంబంధిత విభాగాల ఇన్‌చార్జిలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికి ఇవ్వరాదు. కానీ కాసులకు కక్కుర్తి పడి కింది స్థాయి సిబ్బంది కొందరు విద్యార్థుల సమాచారం అందిస్తున్నారు. దీంతో పీఆర్‌ఓ ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం.. కాలేజీల గురించి వివరిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటివ్‌ అవకాశం ఉండటంతో పోటీ పడుతున్నారు.

పరీక్షల కంటే ముందే అడ్మిషన్ల కోసం తంటాలు

ఇంటర్‌, ఇంజినీరింగ్‌ కోర్సుల పేరిటముందస్తు దోపిడీ

తల్లిదండ్రులకు పెరిగిన ఫోన్ల తాకిడి

సాధారణంగా పదో తరగతి, ఇంటర్‌ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక ఈ సారి గత ఏడాది కంటే ఫీజులు అధికంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కనీసం 20 శాతం అధికంగా ఫీజుల దోపిడీకి కాలేజీలు సిద్ధమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement