గురివింద గింజలు తిని చిన్నారి మృతి
బద్వేలు అర్బన్ : గురివింద గింజలు తిని ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన గురువారం బద్వేలు పట్టణంలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన మాబుసా, పీరాంబి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మాబుసా కృష్ణపట్నం ఓడరేవులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండటంతో ఆయన భార్య కూడా అక్కడే ఉంటోంది. పిల్లలను బద్వేలు పట్టణంలోని గుంతపల్లె క్రాస్‌రోడ్డులో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంచారు. అయితే పెద్ద కుమార్తె అయిన మంజులాబీ (6) పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో తోటి పిల్లలతో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటూ గురివింద గింజలు తినింది. కొద్దిసేపటికి వాంతులు, విరేచనాలు కావడంతో అమ్మమ్మ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించింది. అయితే పరిస్థితి విషమంగా ఉందని, ఎక్కడైనా చూపించండి అని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించగా పరిస్థితి మెరుగుపడకపోవడంతో రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది.
Comments
Please login to add a commentAdd a comment