అక్రమంగా ముగ్గురాయి తవ్వకాలకు యత్నం
– భూ యజమానిపై
టీడీపీ నాయకుల దౌర్జన్యం
లింగాల : తన పొలంలో టీడీపీ నాయకులు అక్రమంగా ముగ్గురాయి తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి చెందిన టి. విజయమోహన్‌రెడ్డి తెలిపారు. ఓబుళరెడ్డి, మనోహర్‌రెడ్డిలు ముగ్గురాయి తవ్వకాలు చేపట్టారని, దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తనపై దాడి చేసేందుకు యత్నించారన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు, లింగాల పోలీసులకు, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశానన్నారు. తనకు సంబంధించిన సర్వే నంబర్ 435/1, 435/2, 434 సర్వే నంబరు నందుగల 7ఎకరాల 75సెంట్లు విస్తీర్ణం గల వ్యవసాయ భూమి ఉందన్నారు. ఈ సర్వే నంబర్లకు తనకు మైనింగ్ లీజ్ ఉందన్నారు. తన భూమిపై వీరికి ఎలాంటి హక్కు లేదన్నారు.
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
కలసపాడు : కలసపాడు మండలంలోని పెండ్లిమర్రి వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న భార్గవి సోమవారం రాత్రి పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలికను చికిత్స నిమిత్తం సిబ్బంది పోరుమామిళ్లలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడి నుంచి కడప రిమ్స్‌కు, ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపల్ రెడ్డిజ్యోతిని వివరణ కోరగా విద్యార్థిని ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కింద పడిందని, వెంటనే అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేసి పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు.
విచారణ జరపాలి..
కడప ఎడ్యుకేషన్: విద్యార్థిని భార్గవి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై విచారణ జరపాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) జిల్లా కన్వీనర్ సగిలి రాజేంద్ర ప్రసాద్, రివల్యూషనరి స్టూడెంట్ యూనియన్ (ఆర్.ఎస్.యూ) జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఇందుకు ఉపాధ్యాయుల వేధింపులే కారణమన్నారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని భార్గవిని మంగళవారం వారు పరామర్శించారు.పాఠశాలలో జరిగిన ఘటనపై తప్పుడు సమాచారం ఇచ్చిన ఎస్.ఓపై, విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.
దాడి ఘటనలో కేసు నమోదు
కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో పులివెందుల రోడ్డు సాక్షి సర్కిల్ సమీపంలో ఈనెల 10వ తేదీన పాతసామాన్ల అంగడిని నిర్వహిస్తున్న విక్రమ్ వద్దకు మాట్లాడేందుకు మల్లికార్జున అనే వ్యక్తి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న కిషోర్, ప్రకాష్, ఇంకా ముగ్గురు మల్లికార్జునను ఎగతాళి చేశారు. దీంతో ఈ విషయాన్ని మల్లికార్జున తన సోదరుడు, సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి మద్దిలేటికి తెలియజేశాడు. మద్దిలేటి వారిని అడిగేందుకు సంఘటన స్థలానికి వెళ్లగా వారు మద్దిలేటి, అతని సోదరుడు మల్లికార్జునపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment