ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి
జేసీ అదితి సింగ్
వల్లూరు : ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన వల్లూరులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను, విద్యార్థుల రిజిష్టర్లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందుతోందా? కాస్మొటిక్ చార్జీలు నెలవారీ అందుతున్నాయా? వసతులు ఎలా ఉన్నాయి? తదితర వివరాలను విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ప్రతి రోజు మెనూ ప్రకారమే భోజనం వడ్డించాలని, నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడవద్దని సిబ్బందికి సూచించారు. అనంతరం ఉపాధ్యాయ సిబ్బందితో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పరీక్షల్లో ఎలాంటి భయం లేకుండా బాగా పరీక్షలు రాసే విధంగా విద్యార్థులకు ధైర్యం చెప్పాలన్నారు. అలాగే విద్యార్థులకు మంచి విద్యా బోధనతో పాటు మంచి క్రమశిక్షణ కూడా నేర్పించాలన్నారు. పాఠశాలలో చేయాల్సిన అభివృద్ధి పనులు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని, వాటిని పరిశీలించి పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ప్రిన్సిపల్‌కు సూచించారు. కడప ఆర్‌డీఓ జాన్ ఎర్విన్, జిల్లా అధికారులు ఆమె వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment