
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్: ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలు పకడ్బందీ భద్రత, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌తో కలసి సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పద వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో 161 పరీక్షా కేంద్రాలలో 14,330 మంది బాలురు, 13,470 మంది బాలికలు మొత్తం 27,800 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను కల్పించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. ఎక్కడ మాస్ కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కడప,బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగు ఆర్డీవోలు జాన్ ఇర్వీన్, చంద్రమోహన్, చిన్నయ్య, సాయిశ్రీ, తహసీల్దార్ లు, విద్యా శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పీ4 సర్వేతో ప్రతి ఇంటికి అభివృద్ధి
ప్రభుత్వ, దాతల, ప్రజల, భాగస్వామ్యం (పీ4) సర్వేతో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి చేకూరుతుందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సభా భవనంలో పీ4 సర్వేపై ప్రజా అభిప్రాయం కోసం జిల్లా పోలీస్ అధికారి అశోక్ కుమార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్, ప్రజలు, దాతలు పార్టనర్‌షిప్‌తో అట్టడుగునున్న 20 శాతం పేదలను, అత్యున్నతంగా ఉన్న 10 శాతం సంపన్నులు ద్వారా అభివృద్ధి చేయడం పి4 ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రాబోయే ఐదేళ్లలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ‘జీరో పావర్టీ –పీ4 పాలసీ‘అమలుకు కృషి చేస్తోందన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజంలోని వివిధ వర్గాలు, మేధావులు, నిపుణులు,ప్రజలు తమ సహకారాలు అందించి పీ4 మోడల్ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమావేశ అనంతరం పారిశ్రామిక వేత్తలు, బ్యాంక్ అధికారులు, ఇతరులు పీ4 విధానంపై సూచనలు, సలహాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.
●అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన అనుమతులను జాప్యం చేయకుండా త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అభివృద్ధి పనులు, రెవెన్యూ సదస్సులు, గ్రామ సభలు, పౌర సరఫరాల పంపిణీపై జేసీ అదితి సింగ్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. సంబంధిత తహసీల్దార్ వద్దకు వచ్చిన దరఖాస్తును రెండు రోజుల్లో పరిశీలించి పరిష్కరించాలన్నారు. సకాలంలో అనుమతులు ఇవ్వక జాప్యం చేసి అక్రమ మైనింగ్‌కు ఆస్కారం ఇవ్వవద్దన్నారు. రెవెన్యూ సదస్సులు, గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పౌర సరఫరాల అంశంలో వంట గ్యాస్ పంపిణీ, నిత్యావసర వస్తువుల పంపిణీ, తూకాల వ్యత్యాసంపై తరచు తనిఖీలు తదితరులపై వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment