వెబ్ ఆప్షన్లను పూర్తి చేయండి
కడప రూరల్: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల డీఎస్సీ ఉచిత కోచింగ్‌కు సంబంధించి వెబ్ ఆప్షన్లను పూర్తి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి తెలిపారు. ఇందుకు సంబంధించి జ్ఞానభూమి వెబ్ ఆప్షన్ సర్వీస్ ప్రారంభమైందన్నారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులు 15న లేదా అంతకుముందు వెబ్ ఆప్షన్ సర్వీస్ ద్వారా ఎంప్యానెల్డ్ కోచింగ్ సంస్ధలకు తమ ప్రాధాన్యతలను తెలియజేయాలని పేర్కొన్నారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్ వెబ్ పోర్టల్‌లో చూడవచ్చని తెలిపారు.
15న బద్వేలులో జాబ్‌మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 15న ఉదయం 10 గంటలకు బద్వేలు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని వెలుగు కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎం కంపెనీలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, డొనో బీపీఓ అండ్ ఐటీ సొల్యూషన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో టెలీ కాలింగ్ ఆఫీసర్, ఆల్ డిక్సన్ కంపెనీలో అసెంబ్లింగ్ ఆపరేటర్, క్వాలిటీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివి 18–45 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఎంపికై న వారికి అర్హతను, అనుభవాన్ని బట్టి రూ. 12–25 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థులు విద్యార్హతలు, ఫొటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.
యూత్ పార్లమెంట్ ఉపన్యాసాల రిజిస్ట్రేషన్ గడువు పెంపు
కడప ఎడ్యుకేషన్: భారత ప్రభుత్వ యువజన,క్రీడా వ్యవహారాల శాఖ నెహ్రూ యువ కేంద్ర ఆదేశాల మేరకు యూత్ పార్లమెంటు ఉపన్యాసాల పోటీలలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్చి 16 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా యువజన అధికారి మణికంఠ తెలియజేశారు. పోటీలలో పాల్గొని యువత వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశం పైన ఉపన్యాసాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారని చెప్పారు. అన్నమయ్య, కడప జిల్లా పరిధిలోని 18 నుంచి 25 ఏళ్లలోపు యువత రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు అవకాశం కల్పించారన్నారు. మార్చి 15వ తేదీన కెఎస్‌ఆర్‌ఎమ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించాల్సిన ఉపన్యాసాల పోటీలు, రిజిస్ట్రేషన్ గడువు పెంపు కారణంగా వాయిదా వేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు 9177616677 సంప్రదించాలని సూచించారు.
మొల్లమాంబ గొప్ప కవయిత్రి
కడప సెవెన్‌రోడ్స్: సరళమైన తెలుగు భాషలో రామాయణం రచించి సమాజానికి అందించిన గొప్ప కవయిత్రి మొల్లమాంబ అని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సభా భవన్ హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతనమొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాహితీవేత్త నరాల రామారెడ్డి, మొల్ల సాహితీ పీఠం అధ్యక్షులు డాక్టర్ విద్వాన్ గానుగపెంట హనుమంత రావు హాజరుకాగా జిల్లా పోలీస్ అధికారి అశోక్ కుమార్, డీఆర్ ఓ విశ్వేశ్వరనాయుడు , ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవీయ విలువలకు ప్రాధాన్యతనిస్తూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు వివక్షతకు వ్యతిరేకంగా తన రచనలు చేశారని కొనియాడారు. బీసీ వెల్ఫేర్ అధికారి భరత్ కుమార్, సాంఘీక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, మొల్ల సాహితీ పీఠం సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment