ప్రొద్దుటూరులో ఆగని చోరీలు
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో దొంగతనాలు ఆగడం లేదు. చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నెల ఏడో తారీఖున మైదుకూరు రోడ్డులోని లక్ష్మీనగర్‌లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. వస్త్రవ్యాపారి వల్లంకొండు రఘువంశీకి చెందిన 850 గ్రాముల బంగారు. 670 గ్రాముల వెండి, రూ. 7.70 లక్షలు నగదును దొంగలు దోచుకెళ్లారు. అయితే వారం రోజుల వ్యవధిలోనే హౌసింగ్‌బోర్డులో మళ్లీ చోరీ జరిగింది. ఇక్కడి గోపిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఇంట్లో సుమారు 25 తులాల బంగారు నగలను దొంగలు అపహరించుకొని వెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజుపాళెం మండలం, టంగుటూరు గ్రామానికి చెందిన శివశంకర్‌రెడ్డి వ్యవసాయదారుడు. వారి ఒక్కగానొక్క కుమార్తె సౌమ్యారెడ్డి చదువుల కోసం ప్రొద్దుటూరులోని హౌసింగ్‌బోర్డు కాలనీలో డూప్లెక్స్ ఇంటిని నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. పొలం పనులు ఉన్నప్పుడు గ్రామానికి వెళ్లొస్తుంటారు. శివశంకర్‌రెడ్డి, భార్య కవిత, కుమార్తె ముగ్గురు ప్రతి రోజు మొదటి అంతస్తులోని బెడ్‌రూంలో పడుకొనేవారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో నిద్రలేచిన వారు బెడ్ రూం డోర్ తీయడానికి ప్రయత్నించగా రాలేదు. బయట గడియ పెట్టి ఉన్నారు. దీంతో శివశంకర్‌రెడ్డి పక్కింటి వాళ్లకు ఫోన్ చేశాడు. వాళ్లు ఇంట్లోకి వెళ్లడానికి రాగా వంట గది వైపు ఉన్న డోర్ లాక్ తొలగించి ఉంది. ఈ విషయాన్ని అతను శివశంకర్‌రెడ్డికి తెలిపాడు. చోరీ జరిగిందని భావించిన అతను వెంటనే టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సూచన మేరకు ఇంట్లోకి ఎవరూ వెళ్లలేదు. టూ టౌన్ సీఐ యుగంధర్, ఎస్‌ఐ ధనుంజయ వచ్చిన తర్వాత వారున్న బెడ్‌రూం గడియ తీశారు. తర్వాత లబోదిబో మంటూ వారంతా బయటికి వచ్చారు.
25 తులాల బంగారు చోరీ
కవిత గాబరాగా ఎదురుగా ఉన్న మరో బెడ్‌రూంలోకి వెళ్లి చూడగా బీరువా తెరచి.. అందులోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లాకర్‌ను పరిశీలిస్తే అందులోని బంగారు నగలన్నీ కనిపించలేదు. అందులో సుమారు 25 తులాల మేర వివిధ రకాల బంగారు నగలు ఉన్నాయి. బీరువా పక్కనే ఉన్న డ్రస్సింగ్ టేబుల్‌లో తాళాలు పెట్టామని, వాటిని తీసుకొని దొంగలు బీరువా తెరిచినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా వేకువ జామున 3.30 గంటల సమయంలో కింద ఏదో శబ్ధం వినిపించినట్లు కవిత చెబుతున్నారు. ఎదురుగా ప్రధాన ద్వారంతో పాటు ఎడమ వైపున వంట గది పక్కన మరో ద్వారం కూడా ఇంటికి ఉన్నాయి. దొంగలు వంటగది పక్కన ఉన్న డోర్ లాక్‌ను తొలగించి సులభంగా ఇంటిపైకి ప్రవేశించారు. ముందు జాగ్రత్తగా శివశంకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు నిద్రపోతున్న బెడ్‌రూంకు గడియ పెట్టి ఎదురుగా ఉన్న మరో బెడ్‌రూంలోకి దొంగలు ప్రవేశించారు. డ్రస్సింగ్ టేబుల్‌లో బీరువా తాళాలు ఉండటంతో దొంగల పని సులభతరమైంది. ఖరీదైన వడ్డానం, ఇతర ఖరీదైన బంగారు హారాలను బ్యాంక్ లాకర్‌లో పెట్టామని లేదంటే భారీ నష్టం జరిగేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం పోలీసులు వేలి ముద్రలు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు పరిశీలించారు. శివశంకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ యుగంధర్ తెలిపారు.
● హౌసింగ్ బోర్డు కాలనీలో 25 తులాల బంగారు దోచుకెళ్లిన దొంగలు
● కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నా
బంగారు కొట్టేసిన అగంతకులు
ప్రొద్దుటూరులో ఆగని చోరీలు
Comments
Please login to add a commentAdd a comment