మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది..ఇటీవల రాయచోటి ఘటనలో దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి.. అని పలు పార్టీలు, సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక నూర్జహాన్ కల్యాణ మండపంలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మతసామరస్యం–ప్రాధాన్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా, కేరళ, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బలపడేందుకు ప్రయోగాలు చేస్తున్నదని తెలిపారు. ఐక్యతకు నిలయమైన రాయలసీమ ప్రాంతంలో మతచిచ్చు పెడుతున్నారని, బీజేపీ దాని అనుబంధ సంస్థలు పనిగట్టుకుని దాడులకు పూనుకుంటున్నాయన్నారు. రాయచోటిలో వీరభద్రస్వామి శోభాయాత్ర పేరిట ముస్లింలు ప్రార్థన చేసుకుంటున్న ప్రార్థనా మందిరం వైపు వెళ్లి మతాచారాలకు విరుద్ధంగా వ్యవహరించి ముస్లింలపై దాడి చేసి వారే తమపై దాడి చేశారని కేసులు పెట్టి అమాయలను జైల్లో వేశారని చెప్పారు. రాయచోటిలో వీరభద్రస్వామి యాత్ర మధ్యాహ్నం మూడు గంటలకు మసీదు దాటుకోవాలని పోలీసులు చెప్పినప్పటికీ, వారు ఉద్దేశపూర్వకంగానే సాయంత్రం 6:15 గంటలకు మసీదు వద్దకు తెచ్చారన్నారు. మసీదు ఎదుట డీజీలు, బాణసంచా కాలుస్తూ, డప్పులు, నినాదాలు చేస్తూ గొడవలు సృష్టించారని, మసీదులో ప్రార్థన చేసుకుంటున్న ముస్లిం పెద్దలపై పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారన్నారు. ఒకప్పుడు దేశ ప్రజలందరూ కలిసి బ్రిటీష్ వారిని ఎదిరించిన గడ్డలో ప్రజల మధ్య మతాల చిచ్చుపెట్టి విడదీసే ప్రయత్నాలకు బీజేపీ ప్రభుత్వం నాంది పలికిందన్నారు. బీజేపీ చేస్తున్న వికృత చేష్టలకు ప్రజలు విసిగిపోయారని, వారు తిరగబడే రోజు అత్యంత దగ్గరలోనే ఉందన్నారు. ఈ సమావేశంలో ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, నగర ముస్లిం ప్రముఖులు జిలాన్, అమీర్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అఫ్జల్ ఖాన్, గౌస్‌పీర్, సీఎస్‌ఐ టౌన్ చర్చి పాస్టర్ మోహన్ బాబు, మల్లెల భాస్కర్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకుడు ఓబయ్య, ఎన్‌ఆర్‌సీ,సీఏఏ వ్యతిరేక కమిటీ కన్వీనర్ బాబు భాయ్, సీహెచ్ శివారెడ్డి, జాకీర్, సంఘ సేవకుడు సలావుద్దీన్, రాయలసీమ మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి తస్లీమా, గౌస్‌పీర్, ఎస్‌బీఐ తాహిర్, కార్పొరేటర్ షఫీ తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి ఘటనకు బాధ్యులను శిక్షించాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
Comments
Please login to add a commentAdd a comment