మహిళపై దాడి కేసులో నిందితుడి అరెస్టు
కమలాపురం : కమలాపురం పట్టణం గిడ్డంగివీధిలో ఈ నెల 13వ తేదీన లక్ష్మీదేవి అనే మహిళపై జరిగిన దాడి కేసులో నిందితుడు ఆకుల రెడ్డి నవీన్‌ను అరెస్ట్ చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన దాడికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. నిందితుడు నవీన్ ఇంటర్ వరకు చదువుకుని ఏడాది పాటు ఏఐఎల్ డిక్సన్ కంపెనీలో పని చేసి మానేశాడు. అనంతరం క్రికెట్ బెట్టింగు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో పాటు మద్యం తదితర వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి తీర్చలేని స్థితికి చేరుకున్నాడు. తన ఇంటి పక్కనే ఉన్న కరంగుడి లక్ష్మీదేవి వద్ద తన మొబైల్‌ను కుదువ పెట్టి రూ.30వేలు అప్పు తీసుకున్నాడు. సెల్‌ఫోన్ కూడా విడిపించుకోలేక లక్ష్మిదేవిని చంపేసి ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు ఒంటిపై ఉన్న నల్లపూసల దండ, తాళిబొట్టు సరుడులను బలవంతంగా లాక్కుని వెళ్లి వాటిని అమ్ముకుని అప్పు తీర్చాలనుకున్నాడు. దీంతో ఈ నెల 13వ తేదీ ఉదయం ఇంట్లో లక్ష్మీదేవి ఒంటిరిగా ఉన్న విషయం తెలుసుకుని, ఇంట్లోకి చొరబడి ఆమెను కత్తితో పొడిచి మెడలో ఉన్న బంగారు నల్లపూసల దండ, తాళిబొట్టు సరుడు బలవంతంగా లాక్కొని పారిపోయాడు. ఎస్‌పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన సీఐ ఎస్‌కే రోషన్, సీసీఎస్ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి, సిబ్బంది తో కలసి దర్యాప్తు చేపట్టి శనివారం వల్లూరు మండలం తోళ్లగంగన్నపల్లె వద్ద నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే అతడి వద్ద నుంచి బంగారు తాళిబొట్టు సరుడు, నల్లపూసల దండతో పాటు, నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. కాగా కేవలం రెండు రోజుల్లోనే దాడి కేసులో నిందితుడుని పట్టుకుని అరెస్ట్ చేసిన సీఐ రోషన్, ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి, సిబ్బందిని ఆయన అభినందించారు. అలాగే వారికి రివార్డులకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment