బద్వేలు అర్బన్ : అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ తెలిపారు. సోమవారం స్థానిక అర్బన్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పట్టణంలోని చెన్నంపల్లె ఎస్టీ కాలనీ సమీపంలో గల కాశినాయన గుడి వద్ద అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం రావడంతో తనతో పాటు ఎస్‌ఐలు, సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. పట్టణంలోని రాజుగారివీధికి చెందిన దండు మనోజ్‌కుమార్, వల్లెరవారిపల్లె గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌లు గంజాయి విక్రయిస్తూ కనిపించారన్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినా, అమ్మకాలు చేపట్టినా, వారికి సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో అర్బన్ ఎస్‌ఐలు ఎం.సత్యనారాయణ, జె.రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
1.50 కేజీల గంజాయి స్వాధీనం