
పట్టు నిలుపుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి ఎట్టకేలకు పట్టు సాధించారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున చైర్‌పర్సన్ వద్దకు వచ్చి చర్చించిన అనంతరం యథావిధిగా కౌన్సిల్ సమావేశాన్ని సోమవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ముందుగా సూచించిన ప్రకారం మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి అధ్యక్షతన శనివారం ఉదయం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కమిషనర్‌తో పాటు అధికారులెవరూ రాకుండా ఆమెను అవమానించారు. కనీసం ఒక్క అధికారి కూడా సమావేశానికి హాజరు కాలేదు. నిబంధనల ప్రకారం కోరం ఉన్నా కమిషనర్ రాకపోవడంతో సమావేశం జరగలేదు. అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే అధికారులు సమావేశానికి గైర్హాజరయ్యారని గమనించిన చైర్‌పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్లు, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేయడంతో పాటు తమ దీక్షను నిరవధికంగా కొనసాగించాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో నిరసన దీక్ష చేస్తున్న చైర్‌పర్సన్ వద్దకు వచ్చారు. ఎందుకు కౌన్సిల్ సమావేశానికి రాలేదని ఆమె కమిషనర్‌ను ప్రశ్నించారు. అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేదని కమిషనర్ చెప్పగా, మీరు లేని పక్షంలో మీ స్థానంలో మరొక అధికారిని నియమించి కౌన్సిల్ సమావేశాన్ని యథావిధిగా నిర్వహించవచ్చనే ఆదేశాలు ఉన్నాయి కదా అని సభ్యులు అడిగారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఎలా చెబితే అలా చేస్తారా అని ప్రశ్నించారు. చైర్‌పర్సన్‌కు కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు సర్వాధికారాలు ఉన్నాయని వైస్ చైర్మన్లు పాతకోట బంగారు మునిరెడ్డి, ఆయిల్ మిల్ ఖాజా అన్నారు. కేవలం ఎమ్మెల్యే ఒత్తిడి వల్లే మీరు చెప్పా పెట్టకుండా సమావేశానికి గైర్హాజరయ్యారని తెలిపారు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని మరోమారు ఇలా జరగకుండా చూస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. యథావిధిగా కౌన్సిల్ సమావేశాన్ని సోమవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో చైర్‌పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు నిరసన దీక్ష విరమించారు. ఈ సమస్యపై చైర్‌పర్సన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టుకు వెళ్లాలనే ఆలోచన చేశారు. పరిస్థితి సద్దుమణగడంతో సమస్య పరిష్కారమైంది.
నేడు కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం