శుభాల రేయి కోసం ఎదురుచూపు
కడప కల్చరల్ : పవిత్ర రంజాన్ మాసం చివరి పది రోజుల్లో ఐదు బేసి రాత్రులను తాఖ్ రాత్‌లు (పవిత్రమైన రాత్రులు)గా భావిస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు తాఖ్ రాత్‌లు గడిచిపోయాయి. ఇక రంజాన్ పర్వదినానికి మూడు రోజులే గడువు ఉంది. నాల్గవ తాఖ్ రాత్ గురువారం రానుంది. దీనిని ముస్లింలు ‘లైలతుల్ ఖద్ర్’ (పెద్దరాత్రి)గా వ్యవహరిస్తారు. ఈ రోజునే ముస్లిం ప్రపంచానికి ఆరాధ్యమైన, అత్యంత పవిత్రమైన దివ్య గ్రంథం ఖురాన్ అల్లాహ్ కృప మేరకు భూమిపై అవతరించిందని పవిత్ర గ్రంథాల ద్వారా తెలియవస్తోంది. అందుకే బడీరాత్‌ను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా రాత్రంతా పశ్చాత్తాప భావనతో దైవ సన్నిధిలో గడిపి ధన్యత పొందేందుకు ప్రయత్నిస్తారు. దైవం పాపలన్నింటినీ క్షమిస్తాడని పెద్దలు పేర్కొంటారు. బడీరాత్ రోజున నిండైన ప్రార్థనలు నిర్వహిస్తే 70 రాత్రుల్లో చేసే పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం ఉంది. అందుకే ఆ పవిత్రమైన రోజు కోసం పది రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ పది రోజుల్లోని బేసి రాత్రులలో జాగరణ చేస్తూ ప్రార్థనలు చేస్తే అధిక పుణ్యం లభిస్తుందని ఆశిస్తారు. ఈ రోజుల్లో మసీదులు, ఇళ్లలో కూడా రాత్రంతా నవాజ్ చదవడం, పవిత్ర ఖురాన్ పఠించడం, జికర్ చేయడం, ఇతర ఆధ్యాత్మిక ప్రసంగాలతో తెల్లవారుజామున సెహరి సమయం వరకు గడుపుతారు. ఈ ప్రత్యేకమైన ప్రార్థనల సందర్భంగా మసీదు కమిటీలు విశేష ఏర్పాట్లు చేశాయి.
నేడు లైలతుల్ ఖద్ర్
ఏర్పాట్లలో మసీదు కమిటీలు