
కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని, సత్వరమే పరీక్షల తేదీ ప్రకటించకుంటే నిరుద్యోగుల పక్షాన చలో విజయవాడ పిలుపునిస్తామని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్ హెచ్చరించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల తేదీ ప్రకటించాలని కోరుతూ బుధవారం కడపలోని మహావీర్ సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో 2022లో నోటిఫికేషన్ ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించి పోస్టులు భర్తీ చేయలేదన్నారు. ప్రతిపక్షంలో ఉండగా యువగళం పాదయాత్రలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో కోర్టు కేసులు క్లియర్ చేసి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఇంతవరకు అతీగతీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రెబ్బ నరసింహులు, నగర కార్యదర్శి విజయ్, నగర సహాయ కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు వంశీ, విద్యుత్ రామకృష్ణ, నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.