
ఫెయిల్ పరీక్షకే.. జీవితానికి కాదు
చదువులో వెనకబడ్డా..
గొప్ప వ్యక్తులయ్యారు
● క్రికెట్ క్రీడాభిమానులు తమ ఆరాధ్యదైవంగా భావించే సచిన్ టెండూల్కర్ టెన్త్ ఫెయిల్ అయ్యారు. అయితేనేం తనకు ఆసక్తి ఉన్న క్రికెట్‌లో రాణించి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గడించారు.
● పాతతరం ప్రజలను, సినీ ప్రేక్షకులను అలరించిన దివంగత అక్కినేని నాగేశ్వరరావు విద్యాభ్యాసం ప్రాథమిక స్థాయిలోనే ఆగిపోయింది. అయితే ఆ యన ఏమాత్రం కుంగిపోలేదు. నటనపై ఉన్న ఆసక్తితో చైన్నెకి వెళ్లి గొప్ప నటుడయ్యారు. అంతేకాదు దేశంలోనే మేటిగా ఉన్న అన్నపూర్ణ స్టూడియోను నిర్మించి అనేక మందికి ఉపాధిని కల్పించారు.
● అబ్దుల్‌కలాంకు మార్కులు తక్కువగా వచ్చేవి. కాని చదవడం, నేర్చుకోవడం అంటే ఆయనకు ఎనలేని ఇష్టం. అదే అబ్దుల్ కలాంను శాస్త్రవేత్తను, మనదేశానికి రాష్ట్రపతిని చేసింది. ‘భారతరత్న’ను కూడా తెచ్చిపెట్టింది.
● ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఎప్పు డూ స్కూల్‌కు వెళ్లలేదు. అయినా పాటల తోటలో గానకోకిలగా కీర్తి గడించారు.
● శ్రీనివాసరామానుజన్ గొప్ప గణిత మేధావి. కొన్నిసార్లు చదువులో ఇబ్బంది పడినా ఎప్పుడూ నిరాశ చెందకుండా లెక్కల్లో కొత్త విషయాలు తెలుసుకునేవారు. అతని మేథాశక్తిని గుర్తించిన గణిత ఆచార్యుల ద్వారా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనకు అవకాశం పొందారు.
ఆత్మస్థైర్యం..సాధించాలన్న తపన ఉంటే చాలు...ఎంతటి కష్టాలనైనా ఎదుక్కోవచ్చు. పరీక్షలు..మార్కులు ర్యాంకులే
పరమావఽధి కాదు. తక్కువ మార్కులు వచ్చినా.. ఫెయిలైనా జీవితం ముగిసిపోదు. క్షణికావేశ నిర్ణయాలు మంచిది కాదు. నిరాశ చెందకుండా మరింత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం పాదాక్రాంతం అవుతుందని విద్యావేత్తలు, సైకాలజిస్తులు సూచిస్తున్నారు. బుధవారం పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
కడప ఎడ్యుకేషన్: ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామన్న బాధతో కొంతమంది, తక్కువ మార్కులు వచ్చాయని మరికొంత మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇక ఏం చేసినా, ఎన్నికోట్లు ఖర్చుపెట్టినా వారి ప్రాణాలు మాత్రం తిరిగిరావు. అంతేకాదు ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకొని బతుకుతున్న తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చారు. వారు ‘ఒక్కటంటే ఒక్క నిమిషం’ మనసు నిబ్బరంగా చేసుకొని ప్రశాంతంగా ముందున్న భవిష్యత్తు, తల్లిదండ్రుల గురించి ఆలోచించివుంటే వారు ఆత్మహత్యలు చేసుకునేవారు కాదు.
ఈ విషయాలు మరువద్దు
● పాస్, ఫెయిల్ అన్నవి అత్యంత సాధారణ విషయాలు. అందువల్ల విద్యార్థులు ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా చాలా లైట్‌గా తీసుకోవాలి. ప్రశాంతంగా ఆలోచించాలి. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని ముందుకు సాగాలి
● జరిగిన పొరపాటుకు కుంగిపోకుండా ఆత్మస్దైర్యాన్ని నింపుకోవాలి
● ఒత్తిడి నుంచి వేగంగా బయటపడేందుకు ప్రయత్నించాలి.
● వెనకబడిన పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలి. అవసరమైతే ఉపాధ్యాయులు, సీనియర్ల సూచనలు, సలహాలు తీసుకోవాలి.
● ఫలితాలు విడుదలయ్యే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు దగ్గరగా ఉండాలి.వారికి ధైర్యం చెప్పాలి.
● ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా తల్లిదండ్రులు ఏమాత్రం కోపగించుకోకుండా పిల్లలతో చిరునవ్వుతో మాట్లాడాలి.
ముభావంగా ఉంటే అప్రమత్తం కండి
● టెన్త్ చదివే విద్యార్థులది కౌమారదశ. అందువల్ల వారి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. ఫలితాలు విడుదలయ్యాక మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంటకనిపెట్టి ఉంచాలి.
● ఆహారం తీసుకోక పోయినా, ఏదో ఆలోచిస్తూ మూభావంగా ఉన్నా వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
● ఫెయిల్ అయిన వారిని ఒంటరిగా ఉంచకూడదు.
క్షణికావేశం వద్దు
టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. టెన్త్ ఫలితాల్లో ఎవరైనా ఫెయిల్ అయినా,ఎవరికై నా తక్కువ మార్కులు వచ్చినా.. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యావేత్తలు, మేధావులు చెబుతున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా కాసేపు ప్రశాంతంగా ఆలోచించుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓటమి విజయానికి తొలిమెట్టులాంటిది. పరీక్షల్లో మనం ఎందుకు తప్పాం, లోపం ఎక్కడుంది అని ఆలోచించి దాని అధిగమిస్తే త్వరలో జరిగే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో తప్పక ఉత్తీర్ణులు కాగలరని విద్యావంతులు చెబుతున్నారు.
జిల్లాలో 27,800 మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూపులు
నేడు పది పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల
పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి
నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు క్షణికావేశానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మార్కులు తక్కువగా ఫెయిల్ అయ్యే విద్యార్థులను చిన్నచూపు చూడకూడదు. విద్యార్థి ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి తీసుకురాకూడదు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగిన వారే ఏదైనా సాధిస్తారు. ప్రపంచ విజేతలుగా నిలుస్తారు. – షేక్. షంషుద్దీన్,
జిల్లా విద్యాశాఖ అధికారి, వైఎస్సార్‌జిల్లా
ధ్రువపత్రాలు కేవలం అర్హతకే...
ప్రపంచ కుబేరుల్లో ఎక్కువ మంది పెద్ద చదువరులేం కాదు. వారు చేసిందల్లా ఒకటే.. నచ్చిన మార్గంలో ప్రయాణించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. మనం చదివిన విద్యా ధ్రువపత్రాలు కేవలం అర్హతగానే పరిగణించాలి. మార్కులు తక్కువ వచ్చాయనో..మనం కోరుకున్న కళాశాలలో సీటు దక్కలేదనో కుంగుబాటుకు గురవటం అనవసరం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని తెలుసుకున్న రోజు ప్రపంచంలోను మనకన్నా గొప్పవారు ఎవరు ఉండరు. – ఓ. వెంకటేశ్వరరెడ్డి, ప్రముఖ సైకాలజిస్టు, కడప
జీవితం నష్టపోదనే భరోసా ఇవ్వాలి
ఒకసారి పరీక్షలో తప్పితే జీవితం నష్టపోదనే భరోసానివ్వాలి. మళ్లీ చదివి పాస్ కావచ్చనే ధైర్యం నింపాలి. పాస్ కాలేదని తిట్టకుండా, వేధించకుండా సముదాయించాలి. తిరిగి మంచిగా చదివి పాసయ్యేలా ప్రోత్సహించాలి. విద్యార్థులు కూడా క్షణికావేశానికి లోనుకాకుండా సమస్యను స్నేహితులు, తల్లిదండ్రులతో చర్చించాలి. మార్కులు కాదు జ్ఞానం ముఖ్యమనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. – డాక్టర్ మహబూబ్‌అలీ, ఎండీ, కడప

ఫెయిల్ పరీక్షకే.. జీవితానికి కాదు

ఫెయిల్ పరీక్షకే.. జీవితానికి కాదు

ఫెయిల్ పరీక్షకే.. జీవితానికి కాదు

ఫెయిల్ పరీక్షకే.. జీవితానికి కాదు