పుట్టినరోజు వేడుకలు చేసుకునే విషయంలో తన ఆలోచనలను అమితాబ్ అందరితో పంచుకున్నారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్నేహితులు, క్లాస్‌మేట్లతో కలిసి పండగ, కొత్తబట్టలు, చిన్న చిన్న బహుమతులు.. తల్లిదండ్రుల నుంచి ఆశీస్సులు తీసుకోవడం అంతా బాగుంటాయన్నారు. కానీ, అసలు కేకులు ఎందుకు తెస్తారో మాత్రం తనకు తెలియదని అయన చెప్పారు. పుట్టినరోజు సందర్భంగా తన ఇంటి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ''అసలు కేకులు ఎందుకు తెస్తారో నాకు తెలియదు. కొవ్వొత్తి ఎందుకు వెలిగిస్తారు, దాన్ని ఎందుకు ఆర్పేస్తారు.. చాకుతో కేకును ముక్కలు ముక్కలు చేసి, దాన్ని తినడం.. ఇప్పుడు సరికొత్త వ్యవహారం మొదలైంది కేకు తీసుకుని ముఖానికి పూస్తారు.. ఇదంతా ఎందుకు చేస్తారో నాకు తెలియదు. నేను మాత్రం ఈ కేకులు వ్యవహారాన్ని చాలాకాలం క్రితమే ఆపేశాను'' అని ఆయన చెప్పారు. మరో రెండు రోజుల్లో సర్కార్-3 సినిమా షూటింగ్ మొదలవుతుందని అమితాబ్ తెలిపారు. సర్కార్‌లో ఉన్న కొన్ని పాత్రలు ఇందులో మారుతాయన్నారు.