దీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన మూవీ 'ఖైదీ నెంబర్.150' అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 11న విడుదలైన ఖైదీ మూవీ వారం రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని సినీ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఫస్ట్ వీక్ టోటల్ గ్రాస్ కలెక్షన్లు 108.48 కోట్లు సాధించిన చిరు లేటెస్ట్ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను సాధించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఏడు రోజులకుగానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.76.15 కోట్లు రాబట్టిందని అల్లు అరవింద్ చెప్పారు. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చిరు తనయుడు రాంచరణ్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే చిరు 150వ మూవీకి దర్శకుడి కోసం ఏమంత పెద్దగా చర్చలు జరపలేదని, వీవీ వినాయక్ అయితేనే న్యాయం చేయగలడని మేం భావించామన్నారు.