ప్రముఖ నటుడు ఆమంచి వెంకట సుబ్రమణ్యం(ఏవీఎస్) తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొద్దికాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. గతంలో కాలేయ మార్పిడి చికిత్స జరిగింది. ఏవీఎస్ కు ఆయన కూతురు కాలేయ దానం చేశారు. దాంతో ఆయన ఆరోగ్యం కుదుటపడింది. తాజాగా మళ్లీ ఆయన ఆరోగ్యం విషమించడంతో గ్లోబల్ ఆస్పత్రిలో గత వారం రోజులుగా చికిత్స అందిస్తున్నారు. వైద్యులు సూచించడంతో ఏవీఎస్ ను ఆయన కుటుంబ సభ్యులు నివాసానికి తీసుకెళ్లారు. ప్రముఖ దర్శకుడు బాపు రూపొందించిన 'మిస్టర్ పెళ్లాం' చిత్రంతో తుత్తి అనే పదం ద్వారా 1993లో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన ఏవీఎస్ 400 పైగా చిత్రాల్లో నటించారు. కోట శ్రీనివాసరావు, ఆలీ, బ్రహ్మనందం లాంటి ప్రముఖ హస్య నటులతో సమానంగా ఏవీఎస్ రాణించారు. శుభలగ్నం, యమలీల, సమర సింహారెడ్డి, ఇంద్ర, కంటే కూతర్నే కను' లాంటి చిత్రాల్లో ఆయన ఉత్తమ నటన ప్రదర్శించారు. సూపర్ హీరోస్, అంకుల్, ఓర్ని ప్రేమ బంగారం కాను, కోతిమూక, రూమ్ మెట్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.