ప్రముఖ హాస్య నటుడు ఏవీఎస్ ఇకలేరు | actor avs nomore | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 8 2013 10:24 PM | Last Updated on Wed, Mar 20 2024 3:19 PM

ప్రముఖ హాస్య నటుడు ఏవీఎస్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఏవీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏవీఎస్ కు గత కొద్దిరోజులుగా గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిలో మార్పులేకపోగా.. మరింత క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఈ మధ్యాహ్నం ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. గతంలో ఏవీఎస్ కు కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తగా ఆయన కుమార్తె కాలేయ దానం చేశారు. దాంతో కొద్ది రోజులు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. తాజాగా మళ్లీ ఆయన ఆరోగ్యం విషమంగా మారండంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రముఖ దర్శకుడు బాపు రూపొందించిన 'మిస్టర్ పెళ్లాం' చిత్రంతో 1993లో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన ఏవీఎస్ దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. తుత్తి అనే పదం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు. కోట శ్రీనివాసరావు, అలీ, బ్రహ్మానందం లాంటి ప్రముఖ హస్య నటులతో సమానంగా ఏవీఎస్ రాణించారు. ఆయన నటించిన తొలి చిత్రం 'మిస్టర్ పెళ్లాం' లో ఉత్తమ ప్రదర్శనకు నంది అవార్డు లభించింది. హస్య నటుడే కాక, దర్శకుడిగా పనిచేశారు. శుభలగ్నం, యమలీల, సమర సింహారెడ్డి, 'ఇంద్ర', 'కంటే కూతర్నే కను' లాంటి చిత్రాల్లో ఆయన ఉత్తమ నటన ప్రదర్శించారు. సూపర్ హీరోస్, అంకుల్, ఓరి నీ ప్రేమ బంగారం కాను, కోతిమూక, రూమ్ మేట్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. పాత్రికేయుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఏవీఎస్, ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఆయన తన కలానికి పదును పెడుతూనే ఉన్నారు. తరచు దినపత్రికలలో ఆయన పేరు కనిపిస్తుంటుంది. ఏవీఎస్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు చిత్రసీమ ప్రముఖ హాస్యనటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement