ఎల్బీ స్టేడియంలో రేపు నిర్వహించనున్న ఏపీఎన్జీవోల సభను ఆపే సత్తా ఎవరికీ లేదని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. రాష్ట్రం కలిసిఉంటేనే అభివృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అడ్డంకులన్నీ అదిగమించి రేపటి ఎన్జీవో సభను విజయవంతం చేసి తీరుతామన్నారు. సభను అడ్డుకుంటామని కొందరు అనడం అప్రజాస్వామికమని అశోక్‌బాబు అన్నారు. ఇది అవగాహన సభ మాత్రమే, ఎవరికీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. సభను అడ్డుకోవడం సంప్రదాయం కాదన్నారు. కోర్టు అనుమతిచ్చాక కూడా కొందరు తప్పని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని శక్తులు రెచ్చగొట్టేలా వ్యవహరించినా సంయమనం పాటించాలని సీమాంధ్ర ఉద్యోగులకు సూచించారు. రేపు సభకు వచ్చే ఉద్యోగులంతా క్రమశిక్షణతో మెలగాలన్నారు. తమ సభకు రాజకీయ నాయకులెవరినీ ఆహ్వానించలేదని అశోక్బాబు తెలిపారు.