రాష్ట్రం విడిపోయింది, సీమాంధ్రకు నాలుగైదు లక్షల కోట్లు ప్యాకేజి కావాలని ఒక నాయకుడు (చంద్రబాబు) అడుగుతున్నాడు. ఆ నాయకుడికి చేతులెత్తి దణ్నం పెట్టి అడుగుతున్నాం, ఆ నిధులేవో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి ఇప్పించండి. వాటితో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవచ్చు సాక్షి, విజయవాడ: ఆగస్టు 12 లోగా పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలంటూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ డెడ్‌లైన్ విధించింది. ప్రజలు కావాలో, పదవులు కావాలో తేల్చుకోవాలంటూ అల్టిమేటం జారీ చేసింది. తద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని వారిని డిమాండ్ చేసింది. లేదంటే 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించింది. ఏపీ ఎన్జీవోలతో పాటు అన్ని సంఘాల ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, విద్యార్థులు, రాజకీయ నాయకులతో కలిసి రాష్ట్ర సమైక్య పరిరక్షణ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగమని, ఆగస్టు 15న అక్కడ భారీ బహిరంగ సభ జరిపి తీరతామని స్పష్టం చేసింది. రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం విజయవాడలో అత్యవసరంగా సమావేశమైంది. సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రతినిధులతో పాటు హైదరాబాద్ నుంచి కూడా ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు. సోమవారం అన్ని జిల్లాల్లో సమావేశాలు, ప్రదర్శనలు చేయాలని, రాజీనామాలు చేయని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లను 6 నుంచి 8 తేదీల వరకూ ముట్టడించాలని నిర్ణయించారు. ఆఖరి ప్రయత్నంగా రాజీనామాల కోసం ఈ నెల 12న మరోసారి వారిళ్లను ముట్టడిస్తామని, అదే రోజు అర్ధరాత్రి నుంచి అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలను స్తంభింప చేస్తామని ఎన్జీవో నేతలు స్పష్టం చేశారు. భేటీ అనంతరం ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు మీడియాతో మాట్లాడారు. రాజకీయ స్వార్థంతో రాష్ట్రాన్ని విభజించాలని తీసుకున్న నిర్ణయం ప్రజలందరినీ మానసిక వ్యధకు గురి చేసిందన్నారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సమ్మె చేస్తాం. ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచుతాం. వారు రాజీనామాలను ఏఐసీసీకో, ముఖ్యమంత్రికో, పీసీసీ అధ్యక్షుడికో ఇస్తే ఒప్పుకోం. స్పీకర్ ఫార్మాట్‌లో స్పీకర్ కార్యాలయానికి ఇవ్వాలి. 4 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల పెన్షనర్లు, ఆర్టీసీ, విద్యుత్ శాఖ ఉద్యోగులతో పాటు అందరినీ ఉద్యమంలో భాగస్వాములను చేస్తాం’’ అని అన్నారు. ‘‘పదవిని అడ్డంపెట్టుకుని ఎంతకాలం ఉంటారు? పదవులు వదిలి రండి. మిమ్మల్ని మళ్లీ గెలిపించే బాధ్యత మేం తీసుకుంటాం. రాజీనామాలు చేయకపోతే మీ రాజకీయ భవిష్యత్తుకు తెర పడినట్టే’’ అని ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. రాష్ట్రాన్ని విడదీసే హక్కు సోనియా, దిగ్విజయ్‌లకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటును ముట్టడిస్తే తప్ప వారు దిగొచ్చే పరిస్థితి లేదన్నారు. ‘హైదరాబాద్‌ను రాజధానిగా అభివృద్ధి చేశాము. 1956 నుంచి ఇప్పటిదాకా నగరాభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు ఆంధ్రా వారికి హక్కు లేదు, బయటకు వెళ్లండంటున్నారు. దేశంలో ఎక్కడైనా ఉండే హక్కు పౌరులకుంది. హైదరాబాద్ మా హోమ్‌లాండ్. దాన్ని తెలంగాణాకు ఎలా పరిమితం చేస్తారు’’ అంటూ నిలదీశారు.
Published Mon, Aug 5 2013 8:34 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement