మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ప్రతాప్‌రెడ్డి సీఎంను కలవడం చర్చనీయాంశమయ్యింది. ఆయన తెలుగుదేశంలో చేరారనే వార్తలతో మంత్రి భూమా అఖిలప్రియ శిబిరంలో కలకలం రేగింది. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టికెట్ కూడా ప్రతాప్‌రెడ్డికే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారనే ప్రచారం సాగుతుండటంపై ఆ వర్గంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం తనతో మాట మాత్రంగానైనా చెప్పకుండా ప్రతాప్‌రెడ్డిని ఎలా చేర్చుకుంటారంటూ అఖిలప్రియ రగిలిపోతున్నట్లు సమాచారం. బుధవారం నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణతో కలసి పాల్గొన్న అఖిలప్రియ.. విషయం తెలియగానే అక్కడినుంచి బయలుదేరి వెళ్లి తన ముఖ్య అనుచరులతో సమావేశమైనట్లు తెలిసింది. ఆళ్లగడ్డలో మొదటినుంచీ భూమా, గంగుల వర్గాల మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రతాప్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం అఖిలప్రియను షాక్‌కు గురిచేసింది. జిల్లాతో సంబంధం లేని ఇద్దరు మంత్రులు జరిపిన మంత్రాంగంతోనే గంగుల ప్రతాప్‌రెడ్డి టీడీపీలో చేరారని తెలుస్తోంది.