బడ్జెట్ సమావేశాల తర్వాత జరుగుతున్న శాసనసభా సమావే శాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అంశాలవారీగా ఎండగట్టడానికి కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ప్రధాన సమస్యలపై టీఆర్‌ఎస్ వైఫల్యాలను, ఎన్నికల హామీలపై నిర్లక్ష్యాన్ని శాసనసభ వేదికగా నిర్మాణాత్మకంగానే నిలదీయడానికి పార్టీ ఎమ్మెల్యేలను సిద్ధం చేస్తున్నది. కరువు, రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ వంటివాటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాలపై ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దృష్టిని కేంద్రీకరించింది. రుణమాఫీ హామీని అమలు చేయకుండా, రైతుల ఆత్మహత్యలకు కారణమైన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతుల విషయంలోనూ, వారికి నష్టపరిహారం విషయంలో మోసపూరిత వైఖరిని చట్టసభలోనే నిలదీయడానికి అవసరమైన నిర్ధిష్ట సమాచారాన్ని సిద్ధం చేసుకుంది.