ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ అభివృద్ధి పేరుతో జీవోలు విడుదల చేసి చంద్రబాబు ప్రజలకు గాలం వేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అనంత వెంట్రామిరెడ్డి అన్నారు. కడప జిల్లాలో శాసనమండలి ఎన్నికల సందర్భంగా రూ. 300 కోట్ల జీవోలు విడుదల చేశారని గుర్తు చేశారు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలలు గడుస్తున్నా.. ఆ అభివృద్ధికి అతిగతి లేకుండా పోయిందన్నారు. తెలుగుదేశం పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ వస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, చంద్రబాబుకు భయం మొదలైందన్నారు. అడుగడుగునా టీడీపీ నేతలు సభకు ప్రజలను రానివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నా.. ప్రజలు వస్తున్నారంటే వైఎస్ జగన్‌కు ఉన్న ఆదరణ ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నారు.