ఏఐసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దయతోనే రాజకీయాల్లో ఇంతెత్తుకు ఎదిగానని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొందరు కోటరీగా ఏర్పడి పార్టీ కోసం సోనియాగాంధీ చేస్తున్న కృషిని బూడిదలో పోసిన పన్నీరులా మారుస్తున్నారని పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుఖాలే కాదు కష్టాలు కూడా అనేకం అనుభవించామని పేర్కొన్నారు. 2004, 2009లో రెండు పర్యాయాలు పార్టీని అధికారంలోకి తేవడానికి తనవంతుగా కష్టపడ్డానన్నారు. శనివారం సాయంత్రం నిజామాబాద్‌లోని ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మపురి శ్రీనివాస్ మాట్లాడారు. మహిళా నాయకురాలిగా ఆకుల లలితకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం తనకు అభ్యంతరం కాదని, అయితే పార్టీలో కీలకనేతగా ఉన్న తనకు చెప్పకుండా, ప్రమేయం లేకుండా ఏఐసీసీని తప్పుదోవ పట్టించే రీతిలో వ్యవహరించడం బాధ కలిగించిందన్నారు.