నిబంధనలు పాటించకుండా, లాభార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు వ్యవహరించడం వల్ల ప్రమాదాలు సంభవించి విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు కూడా వాస్తవానికి కాంట్రాక్ట్ క్యారియర్‌గానే వెళ్లాలి. అంటే బస్సు బయల్దేరిన చోట మాత్రమే మొత్తం ఎంతమంది ప్రయాణికులుంటే అందరినీ ఎక్కించుకుని, వారందరినీ గమ్యస్థానాల వద్ద దించాలి. అంతే తప్ప మధ్యదారిలో మాత్రం ఎవరినీ ఎక్కించుకోకూడదు. అలా ఎక్కించుకునేవాటిని స్టేజి క్యారియర్లు అంటారు. ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు కాంట్రాక్టు క్యారియర్. ఈ విషయాన్ని బస్సు రిజిస్ట్రేషన్ సమయంలోనే పేర్కొన్నారు. కానీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ ప్రయాణికులను ఎక్కించుకున్నారు.