మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్యవహారంలో స్పీకర్ మధుసూదనాచారి, గవర్నర్ నరసింహన్ లు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవరిస్తున్నారని టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ఒకపార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలో మంత్రిగా కొనసాగుతున్న తలసాని రాజీనామా ఆమోదంపై కచ్చితమైన తేదీ చెప్పాలని స్పీకర్ ను గట్టిగా నిలదీశామన్నారు. అయితే చట్టాన్ని, రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేయించారని ఎర్రబెల్లి మండిపడ్డారు. స్పీకర్ పై తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి ఉన్న కారణంగానే ఆయన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారం రోజుల్లోగా తలసాని రాజీనామాపై చర్యలు తీసుకోకుంటే అసెంబ్లీ ముందు ఆందోళన చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు.