వాన, వరద రాష్ట్రంలో ఇంకా విలయం సృష్టిస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలు, వరదల బారిన పడిన వందలాది గ్రామాలు మూడు రోజులు దాటినా జలదిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ముంచెత్తిన వరద తోడు కరెంటు సరఫరా లేకపోవడంతో లోతట్టు గ్రామాల ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. వరదల వల్ల సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధితులు చలికి తట్టుకోలేక, తిండి లేక అల్లాడుతున్నారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించిన దుర్భర పరిస్థితులివి! ఒక్క ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లోనే ఏకంగా 140 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో రోడ్డు సౌకర్యం తెగిపోయింది. 50కి పైగా గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ డివిజన్‌లోని 8 మండలాల్లో 300 గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది.