టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులా తాను విశ్వసనీయ లేని రాజకీయాలు చేయలేనని వైఎస్సార్ సీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ జనభేరి యాత్రలో భాగంగా జగన్ సోమవారం ప్రకాశం జిల్లా కందుకూరు బహిరంగ సభలో ప్రసంగించారు. 'దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ముందు చాలామంది ముఖ్యమంత్రులున్నారు. ఆయన హఠాన్మరణం తర్వాత కొందరు ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో దేశానికి చాటి చెప్పింది వైఎస్సార్ ఒక్కరే. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఆయనొక్కరే. అందుకే ఆయన మరణిస్తే వందలాది గుండెలు ఆగిపోయాయి. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయి నాలుగున్నరేళ్లు కావస్తున్నా ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారు. అందుకే ఆ మహానేత ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే... ప్రజల చేయి నేరుగా వారి గుండెల మీదకు వెళ్తుంది. రాజన్న మా గుండెల్లో జీవించి ఉన్నారని వారు నినదిస్తారు. ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నాకు వారసత్వంగా ఏదైనా వచ్చిందీ అంటే అది ఒక్క విశ్వసనీయతే. అందుకే నేను చంద్రబాబులా అబద్ధాల హామీలు ఇవ్వను. చెప్పేదే చేస్తా... చేసేదే చెప్తా’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఓటు వేసే ముందు ఒకసారి ప్రశ్నించుకోవాలని, ఎలాంటి నాయకుడు కావాలి, ఎటువంటి ముఖ్యమంత్రి కావాలో ప్రశ్నించుకోవాలని జగన్ ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. ఏ నాయకుడు అయితే ప్రజల గుండెల్లో నిలుస్తాడో వారినే సీఎంగా తెచ్చుకోవాలన్నారు. అప్పుడే వారి తలరాతలను మారతాయన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు.
Published Mon, Apr 21 2014 2:22 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement