ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదా? లేక ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ విభజన అజెండాను అమలు చేయడానికి పని చేస్తున్న ఏజంటా? అని వైఎస్ఆర్ సిపి కేంద్ర పాలకమండలి సభ్యుడు మైసూరా రెడ్డి ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజలకు తమ అభిప్రాయం చెప్పడం కోసం సమైక్య శంఖారావం సభను ఏర్పాటు చేసుకోదలచినట్లు ఆయన తెలిపారు. ఈ సభకు అనుమతి ఇవ్వకపోవడం భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమే అన్నారు. హైదరాబాద్లో ఎవరైనా తమ అభిప్రాయాలు తెలుపుకోవచ్చు. అందరి భావాలు ఒక రకంగా ఉండవు. భావాలు వేరుగా ఉండవచ్చు. భావాలు చెప్పుకోవడానికి సభ ఏర్పాటు చేసుకుంటుంటే విచ్ఛిన్నకర శక్తులు, విధ్వంసకారులు చొరబడతారని సాకులు చెప్పడం చాలా తప్పు అన్నారు. సమైక్యవాదిగా చెప్పుకునే ముఖ్యమంత్రికి ఇది తగునా? అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీది మొదటి నుంచి ఒకటే అభిప్రాయం అని చెప్పారు. అందరి అభిప్రాయాలు తెలుసుకొని అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కోరుతున్నట్లు చెప్పారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఐకమత్యంగా ఉంటేనే రాష్ట్రం కూడా బలంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణపై సిడబ్ల్యూసీ తీర్మానం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినదన్నారు. అది పార్టీకి చెందిన ఒక వైఖరి మాత్రమేనని చెప్పారు. ఇటువంటి వైఖరితో తమ జీవితాలతో చలగాటం ఆడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.