కిడ్నాపర్ల అరెస్ట్ : బాలుడు సురక్షితం | kidnappers-arrest-the-boy-is-safe | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 15 2014 8:14 PM | Last Updated on Thu, Mar 21 2024 11:26 AM

ఎనిమిది రోజుల క్రితం కిడ్నాప్ అయిన దామోదర్ అనే బాలుడి కథ సుఖాంతమైంది. పోలీసులకు నిద్రలేకుండా చేసిన కిడ్నాపర్లను పట్టుకున్నారు. పోలీసుల వ్యూహం ఫలించింది. బాలుడు సురక్షితంగా ఉన్నాడు. గోపాలపట్నంలో కాయిన్ బాక్స్‌ వద్ద ఫోన్‌ చేస్తుండగా ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం కెపిహెచ్కి తరలించారు. పెందుర్తి మండలం చింతలగ్రహారానికి చెందిన కోరుబిల్లి శ్రీనివాసరావు,లక్ష్మి దంపతులకు యమున అనే కుమార్తె, దామోదర్(9) అనే కుమారుడు ఉన్నారు. శ్రీనివాసరావు స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. దామోదర్ పెందుర్తి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 8న పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలుడు రాత్రి 8.30కి వినాయక మండపం వద్దకు అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామంలో ఆరా తీశారు. రెండురోజులు వెతికినా ఫలితం లేకపోవడంతో బుధవారం పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల నుంచి ఫోన్: అదృశ్యమయ్యాడనుకున్న దామోదర్ ఉదంతం బుధవారం సాయంత్రం కొత్తమలుపు తిరిగింది. బాలుడు తమ వద్ద ఉన్నాడంటూ గోపాలపట్నం దరి కొత్తపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న కాయిన్‌బాక్స్ నుంచి శ్రీనివాసరావుకు ఫోన్ వచ్చింది. సాయంత్రం 4.20, 4.30కి రెండు దఫాలు ఫోన్ చేసిన దుండగులు 40 గంటల్లో రూ.30 లక్షలు ఇవ్వాలని, లేకుంటే దామోదర్ను చంపుతామంటూ బెదిరించారు. ఫోన్‌కాల్ వాయిస్‌ను రికార్డు చేసిన శ్రీనివాసరావు పోలీసులకు అందించాడు. అందులో బాలుడి గొంతు వినిపించింది. గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లో బాలుడు తిరిగినట్లు పలువురు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. 310 మంది పోలీసులు, 20 బృందాలుగా ముమ్మర గాలింపు చేపట్టారు. శివారు ప్రాంతంలో తనిఖీలు చేశారు. కాయిన్ బాక్సుల వద్ద నిఘాపెట్టారు. పోలీసులు ఊహించినట్లే ఇద్దరు కిడ్నాపర్లు ఈ రోజు గోపాలపట్నంలో కాయిన్ బాక్స్‌ వద్ద దొరికారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement