రాష్ట్ర రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు మరిన్ని చిక్కులు తొలిగాయి. నగరంలో ఆరు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జీ(ఆర్‌ఓబీ)ల నిర్మాణానికిగానూ ట్రాఫిక్ బ్లాక్ చార్జీల పేరిట భారీగా రుసుములు చెల్లించాలని తొలుత పేచీపెట్టిన దక్షిణ మధ రైల్వే ఇప్పుడు మెట్టు దిగింది. ఒక్కో బ్రిడ్జీ నిర్మాణానికి సుమారు రూ.కోటి చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేయడంతో మెట్రో పనులకు లైన్‌క్లియర్ అరుు్యంది. మరోవైపు నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో మెట్రో పనులకు సేకరించాల్సిన 13 ఆస్తులకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించడంతో ఆ మేరకు పరిహారం ఇచ్చేందుకు హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్‌ఎంఆర్) సంస్థ సూత్రప్రాయంగా అంగీకరించడంతో ఈ ప్రాంతంలో మెట్రోకు మార్గం సుగమమైంది. కాగా వచ్చే ఏడాది ఉగాది(మార్చి 28న)నాగోల్-మెట్టుగూడా, మియాపూర్-పంజాగుట్ట మార్గాల్లో తొలి దశ మెట్రో రైళ్లు రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు సమాచారం.