‘ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి.. రాబోయే రోజుల్లో నవరత్నాల వెలుగులకు నంద్యాల నుంచే నాంది పలకండి’ అని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం స్థానిక గాంధీచౌక్‌లో ఆయన మాట్లాడారు. నంద్యాల ప్రజలు తనపై చూపిస్తోన్న ప్రేమానురాగాలను చూసి చంద్రబాబు వెన్నులో భయంపుట్టిందని, అందుకే అడ్డదారుల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని గుర్తుచేశారు. నంద్యాల అభివృద్ధి బాధ్యతను తనపై మోపి నీతిని, ధర్మాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. ‘‘మీరంతా నాకోసం వచ్చి ఎండలో నిల్చున్నారు. చిరునవ్వుతోనే ఆత్మీయతలను పంచిపెడుతున్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు నేను కృతజ్ఞుడిని. ఇక్కడికొచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు.. ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. చేతులో జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతున్నాయి. దాదాపుగా ప్రతి గ్రామంలో తిరిగాం. ఈ 13 రోజులుగా మీరు పంచిన ఆత్మీయతను చూశా. నేనొక్కడినేకాదు.. రాష్ట్రం మొత్తం కూడా చూసింది. ఆ ఆత్మీయత.. చంద్రబాబు వెన్నెముకలో భయాన్నికూడా పుట్టించింది. అందుకే సీఎంతోపాటు క్యాబినెట్ మొత్తం ఇక్కడికి దిగింది. గడిచిన మూడున్నర సంవత్సరాల్లో చంద్రబాబును నంద్యాల రోడ్లపై ఎప్పుడైనా చూశారా? ఆయనంటారు.. జగన్‌కు పనిలేదు.. 15 రోజులుగా నంద్యాలలో తిరుగుతున్నాడు అని. నిజానికి తిరగాల్సింది నేను కాదు.. ఆయన తిరగాలి. సీఎం పదవిలో ఉన్నాయన ప్రజల కోసం తిరగాలి. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కాదు.