తుఫాను ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిందని, ఈ ఆపద సమయంలో అన్ని విధాలా తాము ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. విశాఖపట్నంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ''తుఫాను గమనాన్ని గుర్తించేందుకు టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నారు. ఆరోతేదీ నుంచి ఈ సంకేతాలిచ్చారు. ముందుగా అనుకున్న స్థాయి, దిశ, సమయం అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఒకరకంగా ఈ ఆపద నుంచి తప్పించుకోవడంలో టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కేంద్రం, రాష్ట్రం రెండూ సమన్వయంతో పనిచేసి, సరైన దిశలో పనిచేస్తే ఎంత పెద్ద ఆపద అయినా.. దాన్నుంచి బయటపడొచ్చు. ఆంధ్రా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిమిష నిమిషానికీ అద్భుతమైన సమన్వయంతో పనిచేశాయి. స్థానిక ప్రభుత్వాలు కూడా వాటిని అమలుచేశాయి. విశాఖ ప్రజలను అభినందిస్తున్నాను. ఈ ఆపద సమయంలో ప్రభుత్వం చెప్పినట్లే చేశారు.