తెలంగాణలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) సంస్థాగత నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు రెండేళ్లకోసారి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరుగుతుండగా, ఇకపై ఆ కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచారు. జిల్లా కమిటీలను పూర్తిగా రద్దుచేశారు. ఇక జిల్లా కమిటీల బదులు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలు మాత్రమే కొనసాగుతాయి. ఈ కమిటీల కాలపరిమితి కూడా నాలుగేళ్లకు పెంచారు. ఈ నిర్ణయాలను టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొంపల్లి(హైదరాబాద్)లోని జీబీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన పార్టీ 16వ ప్లీనరీ వేదికపై ప్రకటించారు. ప్లీనరీ ముగింపు సంసందర్భంగా ప్రసంగించిన కేసీఆర్ విమర్శకులను ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు.