ప్రభుత్వ శాఖల్లో అవసరమైన సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమిస్తుండడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా ఔట్‌సోర్సింగ్ విధానాన్ని ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారని నిలదీసింది. తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడాన్ని పరోక్షంగా ప్రశ్నించింది. ఉద్యోగ నియామకాలకు ఔట్‌సోర్సింగ్ సరైన విధానం కాదని తేల్చి చెప్పింది. ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన వైద్య రంగంలో ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీల చట్ట నిబంధనలకు సైతం ఇది విరుద్ధమని పేర్కొంది. ఖాళీల భర్తీలో ఔట్‌సోర్సింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.