భారత్‌ను రెచ్చగొట్టడమే పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన ఎజెండాగా మారినట్లు కనిపిస్తోంది. ఓ వైపు సరిహద్దుల వెంట నిరంతర కాల్పులతో.. మరోవైపు, కవ్వింపు వ్యాఖ్యలతో భారత్‌పై కాలు దువ్వుతోంది. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్, దేశ విభజనలో మిగిలిపోయిన అసంపూర్ణ ఎజెండాగా కశ్మీర్‌ను అభివర్ణించడంతో పాటు.. ‘శత్రు దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే.. వారు భరించలేని స్థాయిలో నష్టం కలిగిస్తామ’ంటూ, భారత్ పేరును ప్రస్తావించకుండా హెచ్చరించారు. సత్వర, స్వల్పకాలిక భవిష్యత్ యుద్ధరీతులను తక్షణమే ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందంటూ భారతీయ సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ గతవారం చేసిన వ్యాఖ్యలకు స్పందనగా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. 1965 భారత్ పాక్ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రావల్పిండిలో ఆదివారం ఓ ప్రత్యేక కార్యక్రమంలో రహీల్ పాల్గొన్నారు.