రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగమైన ఆ పార్టీ వర్కింగ్ కమిటీ! దీనిని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా ఆమోదించింది. కేంద్ర కేబినెట్ కూడా విభజనపై వేగంగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా విభజన విధివిధానాలపై రాష్ట్రంలో అన్ని పార్టీలూ సూచనలు, అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర మంత్రుల బృందం పిలిచింది. కాంగ్రెస్ పార్టీ కూడా జీవోఎం ముందుకు వెళ్లింది. రెండు నాల్కలతో.. రెండు మాటలు చెప్పింది! పది జిల్లాల తెలంగాణ కావాలంటూ ఒక మాట.. అసలు విభజన వద్దే వద్దంటూ ఇంకో మాట!! రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్న అధికార పార్టీయే.. తన సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ (ఆ మంత్రులూ తమ పార్టీ వారే) ఎదుటే.. రెండు వైఖరులు వినిపించటం.. తలపండిన రాజకీయవేత్తల నుంచి సామాన్య ప్రజలవరకూ ప్రతి ఒక్కరికీ విస్తుగొలుపుతోంది! ఇదీ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఆడుతున్న డబుల్ గేమ్! విభజన విధివిధానాలపై జీవోఎం మంగళవారం ఢిల్లీలో ఐదు పార్టీలతో జరిపిన చర్చల వ్యవహారం మొత్తం ఒక ప్రహసనంలా సాగింది. తొలి రోజు చర్చల్లో పాల్గొన్న ఎంఐఎం, బీజేపీ, సీపీఐ, టీఆర్‌ఎస్ - నాలుగు పార్టీల వైఖరీ విస్పష్టంగా ఉన్నప్పటికీ.. ఐదో పార్టీ అధికార కాంగ్రెస్ మాత్రం ఎప్పటిలాగానే హైడ్రామా నడిపించింది. కాంగ్రెస్ తరఫున జీవోఎం ముందుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలంగాణ ఏర్పాటుకు తీసుకోవలసిన అంశాలను పొందుపరిస్తే.. అదే పార్టీ తరఫున వచ్చిన మంత్రి వట్టి వసంతకుమార్ అందుకు భిన్నమైన వాదనతో కూడిన నివేదికను జీవోఎంకు సమర్పించారు. కాంగ్రెస్‌లోని ఇరు ప్రాంతాలకు చెందిన నేతలు.. తమ పార్టీ హైకమాండ్ నిర్ణయానికి భిన్నంగా ఎవరి వాదనలు వారు వినిపించారు. కాంగ్రెస్‌లో కీలక నేతలుగా ఉన్న జీవోఎం ప్రతినిధులు సైతం అదే స్థాయిలో వ్యవహరించారు. ఆయా పార్టీల నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరుకావాలని కోరుతూ లేఖలు పంపగా.. ఆ విషయంలో కాంగ్రెస్‌కు మినహాయింపునిచ్చింది. జీవోఎం ఎదుట కాంగ్రెస్ తరఫున ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి వట్టి వసంతకుమార్ హాజరవుతారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే.. దామోదర, వట్టిలతో పాటు కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ కూడా జీవోఎం భేటీలో పాల్గొన్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రత్యేకంగా వచ్చి హోంమంత్రి షిండేను కలిశారు. జీవోఎంతో భేటీలో దామోదర రాజనర్సింహ నివేదికకు భిన్నంగా.. పీసీసీ రూపొందించిన 20 పేజీల నివేదికను వసంతకుమార్ సమర్పించారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై అదే వైఖరిని చెప్పకుండా కావాలని గందరగోళపరచటానికే ఆ పార్టీ తరఫున హాజరైన ప్రతినిధులు పరస్పర విరుద్ధమైన నివేదికలు ఇవ్వటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం జీవోఎంతో వేర్వేరుగా జరిగిన చర్చల్లో ఎంఐఎం, బీజేపీ, సీపీఐ, టీఆర్‌ఎస్‌ల నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయా పార్టీల తరఫున ఇద్దరు చొప్పున ప్రతినిధులు హాజరైనప్పటికీ తమ తమ వైఖరులను స్పష్టంగానే వెల్లడించాయి. మిగిలిన రాజకీయ పార్టీలను రాజకీయంగా ఇబ్బంది పెట్టటానికి మాత్రమే జీవోఎం అభిప్రాయాల పేరుతో సమావేశాలు నిర్వహిస్తోందన్న విమర్శ అన్ని పార్టీల నుంచీ వ్యక్తమైంది. తొలి రోజు హాజరైన కాంగ్రెసేతర పార్టీల ప్రతినిధులు పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు కూడా జీవోఎం సమాధానమివ్వకుండా దాటవేసింది. తెలంగాణపై గతంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశాల్లో కాంగ్రెస్ తన వైఖరి చెప్పకుండా చివరి వరకు నడిపించిన డ్రామానే ఈసారీ సాగించింది. జీవోఎం ముందున్న ప్రతిపాదనలేంటో రాజకీయ పార్టీల ముందు పెట్టకుండా.. తామిచ్చిన 11 అంశాలపై వైఖరులు చెప్పాలంటూ తప్పించుకుంది. ఇదిలావుంటే.. సమావేశానికి ఆహ్వానిస్తూ ఆయా పార్టీలకు పంపిన లేఖల్లోనే జీవోఎం కొంత గందరగోళం సృష్టించింది. తొలుత.. ‘మీ పార్టీ తరఫున కొద్ది మంది ప్రతినిధులు హాజరుకావాల’ని, ఆ తర్వాత.. ‘ఇద్దరు చొప్పున రావాల’ని మరో లేఖ పంపింది. అంతే కాకుండా ఈ అంశంపై షిండే ఢిల్లీలో కొద్ది రోజుల కింద మాట్లాడినప్పుడు ‘ఒక్కొక్కరు వస్తేనే బాగుంటుంద’ని పేర్కొన్నారు. ఈ రకంగా జీవోఎం ఆయా రాజకీయ పార్టీలను, ప్రజలను గందరగోళపరచటమే ధ్యేయంగా ఒక ప్రహసనంగా వ్యవహారం సాగిస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. ముందు రోజే ఢిల్లీలో స్క్రిప్ట్... మరోపక్క అఖిలపక్షానికి ఒక రోజు ముందే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పార్టీ ప్రతినిధిగా ఎంపికైన మంత్రి వట్టి వసంతకుమార్, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్‌లను ఒక రోజు ముందే హస్తినకు రప్పించి అఖిలపక్షంలో వ్యవహరించాల్సిన స్క్రిప్ట్‌ను ముందే సిద్ధం చేశారు. ఆమేరకు తెలంగాణ ప్రాంత ప్రతినిధిగా డిప్యుటీ సీఎం దామోదర రాజనర్సింహతో హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ, భద్రాచలం తెలంగాణలో భాగం, ఐదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అనే రీతిలో విభజన వాదాన్ని వినిపించారు. సీమాంధ్ర తరఫున మంత్రుల బృందం సంధించిన 11 ప్రశ్నలకు 20 పేజీల నివేదిక రూపంలో సమాధానాలు రూపొందించారు. వాటినే మంత్రులు వట్టి, శైలజానాథ్‌లు జీవోఎంకు నివేదించారు. ఇవేవీ సమస్యలకు పరిష్కారాలు చూపబోవు కనుక కేంద్రం నిర్ణయం నుంచి వెనక్కు తగ్గాలని కోరినట్లు వసంత్‌కుమార్ సమావేశానంతరం మీడియాకు చెప్పారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాక.. కాంగ్రెస్ తరఫున ఇద్దరు ప్రతినిధులను పంపటం, నిర్ణయానికి భిన్నంగా అభిప్రాయాలు చెప్పటం దురదృష్టకరం. అధిష్టానాన్ని ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని మంటగలపటమే అవుతుంది’’ అని తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ధ్వజమెత్తింది. పార్టీల ప్రశ్నలకు జీవోఎం మౌనం... విభజనకు సంబంధించి ఎలాంటి విధివిధానాలు చెప్పకుండా, తమవద్ద ఉన్న ప్రతిపాదనలేమిటో వివరించకుండా, విభ జనతో ముడిపడిన అనేకాంశాల వివరాలు, వివరణలేవీ లేకుండా మంత్రుల బృందం మొక్కుబడిగా పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది. దీంతో జీవోఎం భేటీలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రుల నుంచి మౌనమే సమాధానమయింది. ఉమ్మడి రాజధానిపై కేంద్ర వైఖరి ఏమిటి? రెవెన్యూ పంపిణీపై ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారు? నదీ పంపకాలపై మీ వద్ద ఉన్న సమాచారం ఏమిటి? అని ప్రశ్నించిన పార్టీల ప్రతినిధుల ప్రశ్నలకు ఒక్క మంత్రీ సమాధానం ఇవ్వలేదు. వివరాలు సేకరించే పనిలో ఉన్నామని, ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామనే సమాధానమే తప్ప విభజన ప్రక్రియలో అనుసరిస్తున్న విధానంపై ఏ ఒక్కరు సరైన వివరణ ఇవ్వకపోవటం జీవోఎం పనితీరుకు అద్దంపట్టింది. ‘పలు నివేదికల పేరుతో మీడియాలో వస్తున్న లీకుల్లో వస్తున్న గణాంకాలు నమ్మదగినవేనా? జీవోఎం వద్ద ఉన్న గణాంకాలేమిటి?’ అని బీజేపీ నేతలు అడిగారు. తమ వద్ద సమగ్ర గణాంకాలు లేవని, ప్రస్తుతం తాము సేకరణ పనిలోనే ఉన్నామని జీవోఎం సభ్యులు సమాధానం ఇచ్చారు. జీవోఎం విధివిధానాలపై కేంద్రం వైఖరి చెప్పకుండా, తమ అభిప్రాయం ఎలా చెప్తామని నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ ప్రతినిధులు భేటీ నుంచి నిష్ర్కమించారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నలకు కూడా మంత్రుల మౌనమే సమాధానమయింది. ‘మహారాష్ట్రను విభజించి గుజరాత్ ఏర్పాటయినప్పుడు ముంబైని ఉమ్మడి రాజధానిగా ఎందుకు చేయలేదు? ఆదాయ పంపిణీ ప్రస్తావన ఎందుకు రాలేదు? అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా మీరు సమాధానం చెప్తారా?’ అంటూ జీవోఎంకు అధ్యక్షత వహిస్తున్న హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేను ఒవైసీ నిలదీశారు. చట్టాలు సరిగా చదివి అర్థం చేసుకోకుండా ప్రతిపాదనలు చేస్తున్నారని ఆయన గట్టిగా విమర్శించినప్పుడు కూడా మంత్రులు పెద్దగా స్పందించలేదు. సీపీఐ చేసిన ఆరోపణలకూ మంత్రుల నుంచి ప్రతిస్పందన పెద్దగా కనపడలేదు. జీవోఎంతో నేడు వైఎస్సార్‌సీపీ, సీపీఎం భేటీ రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం(జీవోఎం) బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరపనుంది. రాష్ర్టంలోని ఎనిమిది రాజకీయ పార్టీలను చర్చలకు జీవోఎం ఆహ్వానించగా అందులో అయిదు పార్టీలు... కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఐతో మంగళవారం చర్చలు పూర్తయ్యాయి. బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం ప్రతినిధులతో చర్చలకు సమయం కేటాయించారు. కానీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ జీవోఎం చర్చలకు హాజరుకారాదని నిర్ణయించడంతో ఆ పార్టీ కోసం కేటాయించిన సమయం వృథా కానుంది. జీవోఎంతో చర్చల నిమిత్తం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. లీకులపై పార్టీలు గరంగరం ఇక విభజన ప్రక్రియను అంతా పర్యవేక్షిస్తున్న కేంద్ర హోంశాఖ నుంచి రోజుకొక్క నివేదికంటూ వార్తా పత్రికలకు లీకులు ఇవ్వటంపై అన్ని పార్టీల ప్రతినిధులు జీవోఎంను నిలదీశాయి. మొదటగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నివేదికల లీకేజీలపై ఆంటోనీని, జైరాంరమేష్‌ను నిలదీశారు. ‘విషయాలన్నింటినీ సేకరిస్తున్నామని మీరు చెప్తున్నారు.. హైదరాబాద్ హెచ్‌ఎండీఏ పరిధిలో శాంతిభద్రతలను కేంద్రం చేతిలో పెట్టాలని, హైదరాబాద్ రెవెన్యూను ఇరు ప్రాంతాలకు పదేళ్లు పంచాలని ఆంటోనీ కమిటీ సూచించినట్లు కథనాలు వచ్చాయి. అలాంటిదేమైనా ఉందా?’ అని అసద్ ప్రశ్నించారు. దీనిపై ఆంటోనీ స్పందిస్తూ.. తన నివేదికను ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదని, అలాంటి ప్రతిపాదనలేవీ తమ కమిటీ చేయలేదని వివరించినట్లు తెలిసింది. మరి లీకులు ఇచ్చిందెవరో తేల్చాలని అసద్ గట్టిగా కోరారు. నీటి పంపకాల కథనాలపై లీకేజీలను సైతం జైరాంరమేష్ తోసిపుచ్చినట్లు సమాచారం. ఇక ఇవే అంశాలపై సీపీఐ నారాయణ సైతం గట్టిగానే ప్రశ్నించారు. ‘ఉన్నతస్థాయిలో ఏర్పాటైన జీవోఎం ఉద్దేశపూర్వకంగా లీకులు ఇస్తూ ప్రజల ప్రతిస్పందనను గమనించాలని చూస్తున్నట్లుంది. ఈ లీకులతో ప్రజలు మరింత అయోమయంలో పడే అవకాశం ఉంది. ఉన్నత స్థాయిలో జరుగుతున్న ప్రక్రియపైనే అడ్డదిడ్డంగా లీకులు ఇస్తే ఎలా?’ అని నిలదీశారు. ఇక బీజేపీ అధినేత కిషన్‌రెడ్డి సైతం లీకుల విషయాన్ని గట్టిగానే అడిగారు. టీఆర్‌ఎస్ అధినేత అయితే లీకుల విషయంలో జీవోఎంకు ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఎవరో ఒక్కరి ఉద్దేశాలను మొత్తం నివేదికకు అంటగట్టి ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి లీకులపై జీవోఎం ఉద్దేశమేమిటని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. యూటీ ప్రతిపాదనను వ్యతిరేకించిన ఐదు పార్టీలు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం, పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని చేయాలనే ప్రతిపాదనలను మంగళవారం జీవోఎం భేటీకి హాజరైన ఐదు పార్టీలు.. ఎంఐఎం, బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వ్యతిరేకించాయి. ఉదయం 11 గంటలకు ఎంఐఎంతో భేటీలు ప్రారంభమయ్యాయి. తర్వాత బీజేపీ, సీపీఐ పార్టీలతో చర్చలు జరిగాయి. ఒక్కో పార్టీకి 20 నిమిషాల సమయం ఇచ్చారు. మళ్లీ సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ పార్టీతో చర్చలు ప్రారంభమయ్యాయి. టీఆర్‌ఎస్‌కు అత్యధికంగా దాదాపు 40 నిమిషాల సమయం ఇచ్చారు. జీవోఎంతో సమావేశం అనంతరం విడిగా షిండేతో కేసీఆర్ మరో ఇరవై నిమిషాల పాటు చర్చలు జరిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా పార్టీలన్నీ పార్టీ తరఫున ఒకే వాదన వినిపించాయి.