రాష్ట్రపతులంటే సైనిక వందనాల వంటి రాచలాంఛనాలకే పరిమితమవుతారనే భావనను చెరిపేసిన ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతి పదవి చేపట్టి గురువారం నాటికి సరిగా ఏడాది పూర్తవుతోంది. అంతకుముందు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో క్రియాశీలంగా వ్యవహరించిన ఆయన, రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత సైతం అదే తీరు కొనసాగిస్తున్నారు. ప్రజల మధ్యే రాజకీయ జీవితాన్ని గడిపిన ఆయన, రాష్ట్రపతిగా సైతం ప్రజలకు చేరువగానే ఉంటూ, ‘ప్రజల రాష్ట్రపతి’గా గుర్తింపు పొందారు. ఇదివరకటి రాష్ట్రపతులను సంబోధించినట్లుగా తనను ‘హిజ్ ఎక్సలెన్సీ’ (మహనీయ) అనే గౌరవవాచకంతో సంబోధించాల్సిన అవసరం లేదంటూ తన నిరాడంబరతను చాటుకున్నారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశాధినేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైతం గడచిన ఏడాది కాలంలో ప్రణబ్ అన్ని విషయాల్లోనూ క్రియాశీలంగానే వ్యవహరించారు. చట్టసభల్లో అంతరాయాలకు స్వస్తి చెప్పాలంటూ శాసనకర్తలకు పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థకు తన హద్దులను గుర్తు చేశారు. అయితే, ప్రభుత్వం చెప్పినట్లే చేస్తూ, రాజ్యాంగాన్ని అతిక్రమించకుండా ముందుకు వెళ్లే వ్యక్తిగా మాత్రమే మిగిలిపోయారనే విమర్శలనూ ఎదుర్కొన్నారు. ముంబై దాడుల నిందితుడు అజ్మల్ కసబ్‌కు, పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు అఫ్జల్ గురుకు క్షమాభిక్ష నిరాకరించడం ద్వారా సంచలనం సృష్టించారు. ప్రజల్లో మమేకం కావడం ప్రణబ్‌కు సహజంగా అబ్బిన విద్య. ప్రజలతో కలసిమెలిసి మెలిగే ప్రతి సందర్భాన్నీ ఆయన ఆస్వాదిస్తారు. రాష్ట్రపతిగా ప్రణబ్ ఏడాది కాలంలో ఐదు ఈశాన్య రాష్ట్రాలు సహా 23 రాష్ట్రాల్లో పర్యటించారు. కానీ, కేవలం రెండుసార్లు మాత్రమే విదేశీ పర్యటనలకు వెళ్లారు. స్వాగత సత్కారాల వంటి ఆడంబరాలకు కాకుండా, ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముచ్చటించేందుకే ప్రణబ్ ప్రాధాన్యమిచ్చేవారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమాలకు ప్రొటోకాల్ నిబంధనలను, భద్రతాపరమైన ఆంక్షలను ఆయన చాలావరకు సడలింపజేశారు. రాష్ట్రపతి భవన్‌ను ప్రతి ఒక్కరూ సందర్శించే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ప్రణబ్ మాట్లాడుతూ, ‘బెంగాల్ కుగ్రామంలోని దీపం వెలుగు ఢిల్లీ షాండ్లియర్లను తాకింది’ అని వ్యాఖ్యానించారు. తన పదవిలో ఎన్ని హంగు ఆర్భాటాలున్నా, మట్టిమనిషిగా ఉండేందుకే తాను ఇష్టపడతానని స్పష్టం చేశారు. దర్భార్ హాలుకు పూర్వవైభవం: రాష్ట్రపతి భవన్‌లో ఉపయోగంలో లేకుండాపోయిన దర్బార్ హాలును, లైబ్రరీని పునరుద్ధరించడంలో చొరవ తీసుకుని, ప్రణబ్ చరిత్రపై తనకు గల మక్కువను చాటుకున్నారు. దేశ వారసత్వ సంపదలో ముఖ్యమైన రాష్ట్రపతి భవన్ ప్రాభవాన్ని ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఆయన పలు చర్యలు తీసుకున్నారు. ఆయన చొరవతోనే 340 గదుల రాష్ట్రపతి భవన్‌లోని మార్నింగ్ రూమ్, కమిటీ రూమ్, గార్డెన్ లాగియా, మ్యూజియం, పురాతన ఫర్నిచర్ పునరుద్ధరణకు నోచుకున్నాయి. రాష్ట్రపతి భవన్‌ను, మొఘల్ గార్డెన్స్‌ను సందర్శించాలనుకునే వారు గతంలో సైనిక కార్యదర్శికి లేఖ రాయాల్సి వచ్చేది. ఇప్పుడు దీనికి ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. బిజీ బిజీగా రాష్ట్రపతి షెడ్యూల్... రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలానికి ఏడాది పూర్తవుతున్నా, గురువారం ఆయన పలు కార్యక్రమాల్లో తీరిక లేకుండా తలమునకలు కానున్నారు. మహారాష్ట్రకు చెందిన రామ్ సుతార్ (89) అనే శిల్పి రూపొందించిన మహాత్మా గాంధీ కాంస్య శిల్పాన్ని ప్రణబ్ ఆవిష్కరించనున్నారు. అలాగే, అరుదైన ఫొటోలను డిజిటైజ్ చేసే ప్రాజెక్టు, రాష్ట్రపతి భవన్‌లో నిర్మించిన ప్రణబ్ ముఖర్జీ పబ్లిక్ లైబ్రరీ,డాక్టర్ రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయ విద్యార్థుల కోసం నిర్మించిన క్రికెట్ స్టేడియంను కూడా ప్రణబ్ ప్రారంభించనున్నారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రాష్ట్రపతి సమావేశం కానున్నారని, కేంద్ర మంత్రులకు విందు ఏర్పాటు చేయనున్నారని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి వేణు రాజమొనీ తెలిపారు. ప్రణబ్ ఏడాది పదవీ కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి అధికారిక వెబ్‌సైట్‌లో ‘ది ప్రెసిడెన్సీ: గ్లింప్సెస్ ఆఫ్ ఫస్ట్ ఇయర్’ పేరిట రూపొందించిన వీడియోను, స్వాతంత్య్ర భారత దేశానికి తొలి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి మొదలుకొని అందరు రాష్ట్రపతులకు చెందిన అరుదైన ఫొటోలను చేర్చనున్నట్లు వెల్లడించారు.
Published Thu, Jul 25 2013 2:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement