ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని వైఎస్సార్ సీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత తన సోదరుడితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నికను కురుక్షేత్ర మహా సంగ్రామంగా ఆయన వర్ణించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేశారని, శ్రేయోభిలాషులు వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. తమ కార్యకర్తలు బంగారమని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేశారని మెచ్చుకున్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కష్టపడి పనిచేశారని, కార్యకర్తలు చేతులెత్తి దండం పెట్టాలని అన్నారు. సీఎం, మంత్రులు మకాం వేసి ప్రలోభాలు పెట్టినా తమకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. సీఎం ఆరు రోజులు, ఆయన తనయుడు రెండ్రోజులు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు నెల రోజులు ఇక్కడే మకాం వేశారని వెల్లడించారు.