భారతదేశ సరిహద్దుల్లో మొదటి రక్షణ వలయమైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్)కు చీడ పట్టుకుంది. గొప్ప పేరుప్రతిష్ఠలున్న ఆ విభాగాన్ని కొందరు అధికారులు గబ్బుపట్టిస్తున్నారు. ఎండనకా వాననకా కాపలా కాస్తోన్న జవాన్లకు అందాల్సిన బలవర్ధక ఆహారపదార్థాలను నల్ల బజారులో అమ్ముకుంటున్నారు. పెట్రోల్, డీజిల్‌ను సైతం పక్కదారి పట్టిస్తున్నారు. ఇటీవలే జమ్ముకశ్మీర్ 29వ బెటాలియన్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్‌చేసిన వీడియో దుమారం చల్లారకముందే, బీఎస్‌ఎఫ్‌లో అక్రమాలపై మరికొన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. ఇంత జరుగుతున్నా కేంద్ర హోం శాఖ స్పందించకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.