తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేతల రహస్య ఢిల్లీ పర్యటన.... జేఏసీలో చిచ్చు రేపుతున్నాయి. తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్, మరో ముఖ్యనేత శ్రీనివాస్గౌడ్లు ఢిల్లీ వెళ్లి ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భేటీ అయినట్లు సమాచారం. అయితే దీనిపై కోదండరామ్ నోరు మెదపటం లేదు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. కాగా తెలంగాణ ఏర్పాటుతో ఆ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా మారాలని భావించిన కాంగ్రెస్ ఆశించిన ఫలితం దక్కకపోవడంతో తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్‌ఎస్ నుంచి వలసలు ప్రోత్సహించి ఆ పార్టీని బలహీనపరచాలని భావించిన కాంగ్రెస్ పెద్దలు ఆ ప్రయత్నంలో కాస్త సఫలమయ్యారు. పనిలో పనిగా ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లిన జేఏసీ ముఖ్యనేతల్ని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఈనేపథ్యంలో కోదండరామ్, శ్రీనివాస్‌గౌడ్ ఢిల్లీ పర్యటన ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. జేఏసీలోని మిగిలిన నేతలకు సమాచారం లేకుండా వీరిద్దరూ ఢిల్లీ వెళ్లడంపై జేఏసీలో చర్చ ప్రారంభమైంది. హస్తిన పర్యటనలో ఇద్దరు నేతలు కాంగ్రెస్ పెద్దలతో భేటి అయ్యారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణపై పార్టీపరంగా నిర్ణయం తీసుకునే నేపధ్యంలో జేఏసీ మద్దతు కోసం కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలను టీఆర్ఎస్ నిశితంగా గమనిస్తోంది.