తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టు మూడేళ్ల నిషేధపు కట్లు తెంచుకుని తిరిగి పూర్వవైభవంతో సందడి చేయనుంది. ఆట నిర్వహణకు అడ్డంకులు తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ విద్యాసాగర్ శనివారం ఆమోదించారు. జల్లికట్టు కోసం ప్రజలు భారీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ సరైన చర్యేనని, నిరసనకారులు ఇక ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరినట్లు రాజ్‌భవన్ తెలిపింది. ఆర్డినెన్స్ రాకతో ఆదివారం రాష్ట్రంలో జల్లికట్టు అట్టహాసంగా తిరిగి ప్రారంభం కానుంది. ఆటకు ప్రసిద్ధిగాంచిన మదురైజిల్లా అలంగానల్లూరులో సీఎం పన్నీర్ సెల్వం ఉదయం జెండా ఊపి క్రీడను ప్రారంభిస్తారు. ఆట కోసం 350 ఎద్దులను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ చెప్పారు. జల్లికట్టు కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించడం, బంద్‌తో రాష్ట్రం స్తంభించడంతో.. తమిళనాడు ప్రభుత్వ ముసాయిదా ఆర్డినెన్స్‌ను కేంద్రం శుక్రవారం ఆమోదించడం తెలిసిందే.