ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లుపై చర్చ ముగిసినట్లు డిప్యూడీ స్పీకర్ కురియన్ ప్రకటించారు. కాగా, విపక్షాలు ప్రతిపాదించిన సవరణలపై మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించేందుకు అనుమతిస్తున్నట్లు కురియన్ తెలిపారు. మూజువాణి పద్దతిలో ఓటింగ్ నిర్వహించే సమయంలో కూడా గందరగోళ పరిస్థితులు అలుముకున్నాయి. అంతకు ముందు సభలో సాధారణ పరిస్థితి కొనసాగేలా డిప్యూటీ చైర్మన్ చూడాలని, అప్పుడు మాత్రమే తెలంగాణ బిల్లు గురించిన సమగ్ర చర్చ జరిగేందుకు వీలుంటుందని బీజేపీ సభ్యుడు వెంకయ్య నాయుడు సూచించారు. తెలంగాణ బిల్లుపై చర్చను ప్రారంభించాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఆయనను కోరినప్పుడు వెంకయ్యనాయుడు లేచి నిలబడి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే వెల్లో అప్పటికే ఉన్న సీమాంధ్ర ఎంపీలు, తమిళనాడు ఎంపీలు తమ నినాదాలు కొనసాగించడంతో ఆయన మాట్లాడేది ఒక్క డిప్యూటీ చైర్మన్కు తప్ప ఎవరికీ వినిపించలేదు. సభ సజావుగా సాగితే తప్ప గంభీరమైన ఈ సమస్యపై తాను ఏమీ మాట్లాడలేనని, చర్చలో పాల్గొనలేనని వెంకయ్య అన్నారు.