తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలుగా మాత్రమే విడిపోదామని, తెలుగువారిగా కలిసి ఉందామని మంత్రి జానారెడ్డి చెప్పారు. గోల్కొండ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి కుంటుపడకముందే, పరిస్థితి చేయిజారకముందే, అవాంఛనీయ పరిణామాలు తలెత్తకముందే అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించాని ఆయన కోరారు. అందరూ అధిష్టానానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను సామరస్యంగా పరిష్కారించుకుందామని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. రెండు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి పథంలో పయనించాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. కేవలం పరిపాలనా పరంగా మాత్రమే విడిపోతున్నట్లు భావించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసంమే విడిపోతున్నామని గుర్తించాలన్నారు. సమస్య పరిష్కరించేందుకు మీడియా కూడా సహకరించాలని కోరారు. విద్వేషాలకు తావులేకుండా సమస్యను పరిష్కరించుకుందామన్నారు.