ఓటుకు కోట్లు వ్యవహారంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఏసీబీ విచారణకు హాజరు కాకుండా ఎక్కడ ఉన్నారనేది.. ప్రస్తుతం జిల్లాలో ప్రధానంగా సాగుతున్న చర్చనీయంశం! ఈనెల 19న సాయంత్రం లోగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఆయనకు నోటీసులు పంపిన విషయం విదితమే. అయితే ఆయన మాత్రం ఆరోగ్యం సరిగ్గా లేనందున ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని.. ఈపరిస్థితులతో ‘మీ వద్దకు రాలేకపోతున్నా, కోలుకున్న వెంటనే మీ వద్దకు వచ్చి పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తా.. లేదా మీరు నేనున్న ఆస్పత్రికి వస్తే కావాల్సిన సమాచారం ఇస్తా’ అంటూ ఏసీబీకి లేఖ రాశారు. లేఖలో సండ్ర ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారో పేర్కొనకపోవడంతో అసలు ఆయన ఎక్కడ ఉన్నారన్నది జిల్లాలో హాట్ టాపిక్ అయింది.